నేటి నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు
నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

పార్లమెంటు రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఏప్రిల్‌ ఎనిమిదో తేదీ వరకు సుమారు నెల రోజుల పాటు సమావేశాలు జరగాల్సి ఉండగా, ఎన్నికల దృష్ట్యా రెండు వారాలకే కుదించే అవకాశం ఉంది. అన్ని పార్టీలూ ఇందుకు సుముఖంగా ఉండడంతో ప్రారంభం రోజునే ఈ మేరకు ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కరోనా దృష్ట్యా ఇంతవరకు రాజ్యసభను ఉదయం, లోక్‌సభను సాయంత్రం నిర్వహించగా ఇప్పుడు రెండు సభలనూ ఉదయం 11 గంటలకే ప్రారంభించనున్నారు.

సమావేశాల్లో పింఛను నిధి నియంత్రణ-అభివృద్ధి ప్రాధికారిక సంస్థ సవరణ బిల్లు, మౌలిక వసతుల కల్పనకు నిధులు సమకూర్చే జాతీయ బ్యాంకు బిల్లు, విద్యుత్తు సవరణ బిల్లు, క్రిప్టో కరెన్సీ, అధికారిక డిజిటల్‌ కరెన్సీ నియంత్రణ బిల్లులు సభ పరిశీలనలోకి రానున్నాయి. ఎన్నికల దృష్ట్యా వివిధ పార్టీల సీనియర్‌ నాయకులు కూడా సమావేశాలకు హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది.

సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చర్చించింది. సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్‌ విధానంలో సమావేశం నిర్వహించారు. నూతన వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, పెట్రోల్‌ ధరల పెరుగుదల, సామాజిక మాధ్యమాలపై విధించిన నిబంధనల గురించి ప్రశ్నించనున్నారు.


Tags

Read MoreRead Less
Next Story