ప్రముఖ గాయని అనురాధా పౌడ్వాల్ ఇంట విషాదం

ప్రముఖ గాయని అనురాధా పౌడ్వాల్ ఇంట విషాదం
ప్రముఖ గాయని అనురాధ పౌడ్వాల్ కుమారుడు ఆదిత్య పౌడ్వాల్ మరణించారు. ఆయన వయసు 35 సంవత్సరాలు.

మ్యూజిక్ కంపోజర్ ఆదిత్య నిర్మాతగానూ కొన్ని చిత్రాలకు పనిచేశారు. కొంతకాలంగా అతడు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. గాయకుడు, సంగీత నిర్మాత శంకర్ మహాదేవన్ ఆదిత్య మరణాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "ఈ వార్త నన్ను కలచివేసింది. మా ప్రియమైన ఆదిత్య పౌద్వాల్ ఇక లేరు! ఎంత అద్భుతమైన సంగీతకారుడు, అందమైన వ్యక్తిత్వం, సుందరమైన రూపంతో తన చుట్టూ ఉన్న వారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచేవాడు.. మేమిద్దరం కలిసి చాలా ప్రాజెక్టులు చేశాము. అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. లవ్ యు ఆదిత్య .. నిన్ను మిస్ అవుతున్నాను" అని రాశారు.

శంకర్ మాట్లాడుతూ , "ఆదిత్య వయసు 35 మాత్రమే. అతడు చాలా సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కాని తరువాత అతను కోలుకున్నాడు. ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టాడు. కానీ అతడి అనారోగ్యం మళ్లీ పునరావృతమైంది. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో ఇబ్బందిపడుతున్నాడు. చివరకు, అతని కిడ్నీస్ కూడా ఫెయిలయ్యాయి. గత నాలుగు రోజుల నుంచి అతను ఆసుపత్రిలో ఐసియులో ఉన్నాడు. ఈ ఉదయం అతను కన్నుమూశాడు అని విచారవదనంతో శంకర్ వివరించారు.

గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ ఆదిత్య పౌద్వాల్ ఆకస్మిక మరణం తనను కలచివేసిందని, అతని ప్రకాశవంతమైన ముఖం ప్రతిబింబాన్ని మేము ఎప్పటికీ మరచిపోలేము. దేవుడు అతనికి శాశ్వతమైన విశ్రాంతిని ఇచ్చాడు. కుటుంబానికి మా ప్రగాఢ సంతాపం అని తెలిపారు.

ఆదిత్య తన తల్లి అనురాధా ఫౌడ్వాల్ తో కలిసి కొన్ని భజనల్లో పాల్గొన్నారు. ఆదిత్య దేశంలోని అతి పిన్న వయస్కుడైన సంగీత నిర్మాతగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేయబడింది. ఆదిత్య తల్లిదండ్రులు ఇరువురూ సంగీత ప్రపంచంలో తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తల్లిదండ్రుల బాటలోనే పయనించిన ఆదిత్య సైతం సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిసారిగా అతడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన ఠాక్రే సినిమాకు సంగీతం అందించాడు.

Tags

Read MoreRead Less
Next Story