కరోనా స్ట్రెయిన్ బాధితులకు సింగిల్ రూమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స

కరోనా స్ట్రెయిన్ బాధితులకు సింగిల్ రూమ్‌ ఐసోలేషన్‌లో చికిత్స
యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో కొత్తగా మార్పు చెందిన కరోనా స్ట్రెయిన్‌ వైరస్‌ ఉన్నట్లు తేలింది.

బ్రిటన్‌లో వెలుగుచూసి ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోన్న కరోనా కొత్త రకం స్ట్రెయిన్‌ వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించింది. దేశంలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఇటీవల యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో కొత్తగా మార్పు చెందిన కరోనా స్ట్రెయిన్‌ వైరస్‌ ఉన్నట్లు తేలింది. బెంగళూరులోని నింహన్స్‌లో మూడు, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో రెండు, పుణెలోని ఎన్‌ఐవీలో ఒక కేసు నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారంగా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఆరుగురిని ఆయా రాష్ట్రాల్లో సింగిల్‌ రూం ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది. మరోవైపు కొత్తరకం కేసులు నిర్ధారణ అయిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ఆరుగురి తోటి ప్రయాణికులు, కుటుంబసభ్యులును ట్రేసింగ్‌ చేస్తోంది.

తెలంగాణలోనూ కరోనా కొత్తరకం వైరస్‌ స్ట్రెయిన్‌ కలకలం రేపుతోంది. బ్రిటన్ నుంచి వచ్చిన వరంగల్‌ వ్యక్తికి స్ట్రెయిన్ ఉన్నట్టు నిర్దారించారు. ఆ వ్యక్తితో ప్రాథమికంగా కాంటాక్టు అయినవారిలో తల్లి, భార్య, డ్రైవర్‌ ఉన్నారు. వీరికి పరీక్షలు చేయగా.. తల్లికి పాజిటివ్‌ అని తేలింది. ఆమెకు సోకింది కొత్త కరోనానా కాదా అని తేల్చేందుకు నమూనాలను సీసీఎంబీకి పంపారు. స్ట్రెయిన్ వైరస్ సోకిన వరంగల్‌ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని, కొద్ది రోజుల్లోనే డిశ్చార్జి అవుతారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.

స్ట్రెయిన్ వైరస్‌ ఆందోళనకరంగా మారిన సమయంలో భారత్‌లో ఈ కేసులు వెలుగుచూడటం కలవరపెడుతోంది. ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో కరోనా కొత్తరకం విజృంభిస్తుండటంతో అక్కడ ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త రకం వైరస్‌ 70శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. కరోనా వైరస్‌ ఇప్పటికే పలుసార్లు మార్పులు చెందగా.. సెప్టెంబరులో ఈ వైరస్‌లో చోటుచేసుకున్న గణనీయమైన పరివర్తనాలు ప్రమాదకరంగా మారినట్లుగా బ్రిటన్‌ గుర్తించింది. శరీరంలో వృద్ధి చెందిన యాంటీబాడీస్‌ నుంచి కూడా ఇది తప్పించుకుంటుందని పరిశోధకులు కనుగొన్నారు. యూకేలో తొలిసారి వెలుగులోకి వచ్చిన ఈ వైరస్‌ ఇటలీ, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లోనూ విస్తరించడంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ కంటే.. ఈ జన్యు మార్పు చెందిన వైరస్‌ అతి వేగంగా వ్యాప్తి చెందే స్వభావాన్ని కలిగి ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story