కుప్పలు తెప్పలుగా కరోనా మృతదేహాలు.. శ్మశాన వాటికల వద్ద శవాలతో జాగారం

కుప్పలు తెప్పలుగా కరోనా మృతదేహాలు.. శ్మశాన వాటికల వద్ద శవాలతో జాగారం
కరోనా మరణాలు ఏ స్థాయిలో ఉన్నాయనే లెక్కలు శ్మశాన వాటికలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

కరోనా కేసులు పెరుగుతున్నా.. మరణాల సంఖ్య అంత ఆందోళనకరంగా లేదు అని అనుకున్నాం ఇంత కాలం. కాని, ఆస్పత్రుల నుంచి వస్తున్న మృతదేహాలు, శ్మశానాల వద్ద క్యూలు కడుతున్న శవాలను లెక్కేస్తే.. వాస్తవానికి, గణాంకాలకు చాలా వ్యత్యాసం ఉన్నట్టు కనిపిస్తోంది.

ఉత్తరాది రాష్ట్రాల్లో లెక్కకు మించి కరోనా మరణాలు సంభవిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లక్షణాలు బయటపడని కరోనా పేషెంట్లలో అకస్మాత్తుగా గుండెపోటు రావడం ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు వైద్యులు. అందువల్లే కరోనా మరణాల లెక్కలకు, కరోనాతో చనిపోతున్న వారి సంఖ్యకు పొంతన ఉండడం లేదన్న వాదన వినిపిస్తోంది.

కరోనా మరణాలు ఏ స్థాయిలో ఉన్నాయనే లెక్కలు శ్మశాన వాటికలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. గుజరాత్‌లో అయితే అత్యంత దయనీయ, దారుణ పరిస్థితులు ఉన్నాయి. అహ్మదాబాద్‌లోని ఎల్లి‌స్‌బ్రిడ్జ్‌ దహనవాటికకు ఒకే వాహనంలో రెండు, మూడు మృతదేహాలను తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

గాంధీనగర్‌ శ్మశాన వాటికకు రోజుకు 70 మృతదేహాలను తీసుకొస్తున్నారు. సాధారణ మృతదేహాలతో పాటు కరోనా మృతదేహాలు కూడా శ్మశాన వాటికకు వస్తుండడంతో ఒక్కొక్కరు కనీసం నాలుగైదు గంటలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సూరత్‌లో అయితే కనీసం పది గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది.

ఒక్క గుజరాత్‌లోనే కాదు.. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. గత వారం రోజులుగా కరోనా మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దీంతో శ్మశాన వాటికల దగ్గర అంత్యక్రియల కోసం శవాలతో పడిగాపులు పడాల్సి వస్తోంది. సాయంత్రం దాటితే హిందువులు అంత్యక్రియలు చేయరు. కాని, రాత్రంతా కరోనా శవంతో ఉండాల్సి వస్తుండడంతో.. రాత్రి పగలు అని తేడా లేకుండా కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో అయితే భోపాల్ గ్యాస్‌ లీక్ దుర్ఘటన నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు. గ్యాస్ లీక్ సమయంలో గుట్టలుగా శవాలు పేరుకుపోయాయి. ఇప్పుడు కూడా భోపాల్‌ శ్మశాన వాటికల దగ్గర అలాంటి క్యూలు కనిపిస్తున్నాయని ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోనూ కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మాజీ సీఎం అఖిలేశ్‌ సైతం కరోనా బారిన పడ్డారు. కాని, ఉత్తర ప్రదేశ్‌లో కరోనా మరణాల సంఖ్యను తగ్గించి చెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారం రోజుల్లో 124 మంది చనిపోయినట్లు ప్రభుత్వం లెక్కలు చూపెడుతోంది.

కాని, శ్మశాన వాటిక రికార్డుల్లో మాత్రం 400 మందికి పైగా అంత్యక్రియలు చేసినట్లు కనపడుతోంది. కాని, అధికారులు మాత్రం ఈ లెక్కలను ధృవీకరించడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story