చెన్నై వాసులకు శుభవార్త.. ప్రత్యేక రైలు ద్వారా నీరు..

చెన్నై వాసులకు శుభవార్త.. ప్రత్యేక రైలు ద్వారా నీరు..

తీవ్రదాహార్తితో అల్లాడుతున్న చెన్నై వాసుల నీటి కష్టాలు తీరనున్నాయి. రెండున్నర మిలియన్‌ లీటర్ల నీటిని ప్రత్యేక రైలు ద్వారా తరలిస్తున్నారు. తమిళనాడులోని వెల్లూరు నుంచి 50 నీటి ట్యాంకర్‌ వ్యాగన్ల ద్వారా నీటిని పంపుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి ఈ నీటి రైలు చెన్నై చేరుకుంటుంది. ఈ రోజు ఉదయం జోలార్‌పేట్‌ రైల్వే స్టేషన్‌ నుంచి జెండా ఊపి రైలుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రత్యేక రైల్లోని ఒక్కో వ్యాగన్‌లో 50 వేల లీటర్ల నీరు పడుతుంది. మొత్తం 50 నీటి ట్యాంకర్‌ వ్యాగన్ల రాకతో చెన్నై వాసుల నీటి కష్టాలు కొంతైనా తీరుతాయి.

ఈ ప్రత్యేక రైలు నిన్ననే చెన్నై చేరాల్సి ఉన్నప్పటికీ... రైల్వే స్టేషన్‌లోని కనెక్టింగ్‌ వాల్వ్‌ సమస్యలతో ఒక రోజు ఆలస్యమైంది. రైలు విల్లివక్కం స్టేషన్‌ చేరగానే నీటిని అన్‌లోడ్‌ చేసే కార్యక్రమాన్ని మంత్రులు పరిశీలిస్తారు. చెన్నై నీటి కష్టాలు తీర్చడానికి ప్రతి రోజు 10 మిలియన్‌ లీటర్ల నీటిని రైళ్ల ద్వారా తరలిస్తామని సీఎం పళనిస్వామి తెలిపారు. రైల్లో నీటిని తరలించే కార్యక్రమం కోసం ప్రభుత్వం 65 కోట్ల రూపాయలు కేటాయించింది.

చెన్నై నీటి బోర్డు ప్రతి రోజు 525 మిలియన్‌ నీటిని ప్రజలకు అందిస్తోంది. ఇలా రైలు ప్రతి ట్రిప్పు వేయడానికి 8 లక్షల 50 వేల రూపాయల ఖర్చువుతోంది. గత కొన్ని నెలలుగా చెన్నైలో నీటి కష్టాలు తీవ్రంగా ఉండటంతో స్కూళ్లకు సెలవు ఇవ్వగా, చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసుకోండని తెలిపాయి. ఓ మోస్తరు నుంచి పెద్ద పెద్ద హోటళ్లన్నీ నీటి కోటా విధించాయి.

Tags

Read MoreRead Less
Next Story