ప్రజాప్రతినిధులపై కేసులు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రజాప్రతినిధులపై కేసులు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Supreme Court: మనీల్యాండరింగ్‌ వంటి కేసుల్లో ఛార్జిషీట్లు లేకుండా ఆస్తుల జప్తుతో ప్రయోజనమేంటని సుప్రీంకోర్టు ధర్మాసనం సీబీఐ, ఈడీలను ప్రశ్నించింది.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.. చాలా కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయకపోవడానికి గల కారణాలు చెప్పలేని దర్యాప్తు సంస్థల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల స్థితిగతులపై అమికస్‌ క్యూరీగా వున్న సీనియర్‌ న్యాయవాది విజయ హనసరియ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించారు.

మనీ ల్యాండరింగ్‌ కేసుల్లో 51 మంది ఎంపీలు, 71 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిందితులుగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు అమికస్‌ క్యూరీ. నివేదికను సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది.. నివేదిక అసంపూర్తిగా ఉందని పేర్కొంది.

10-15 ఏళ్ల కిందటి కేసుల్లోనూ కనీసం అభియోగాలు కూడా నమోదు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. కనీసం ఛార్జిషీటు దాఖలు చేయడానికి కారణాలు కూడా చెప్పలేదంటూ ఘాటు వ్యాఖ్యలే చేసింది. తాము దర్యాప్తు సంస్థలను నిలదీయడం లేదని.. న్యాయమూర్తుల్లాగే వారికీ అధిక భారం ఉందని కాబట్టే సంయమనం పాటిస్తున్నామని చెప్పింది. అనేక మనీ ల్యాండరింగ్‌ కేసుల్లో ఈడీ కేవలం ఆస్తులు జప్తు చేయడం మినహా ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఛార్జిషీట్లు లేకుండా ఆస్తులు స్వాధీనం చేసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story