యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్..!

యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్..!
కరోనా థర్డ్‌వేవ్ ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటే.. యాత్రలకు ఎలా అనుమతి ఇచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కాంవడ్‌ యాత్రకు అనుమతి ఇవ్వడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కరోనా థర్డ్‌వేవ్ ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటే.. యాత్రలకు ఎలా అనుమతి ఇచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి యూపీ సర్కారు సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. కాంవడ్ యాత్రకు సంబంధించిన అంశాన్ని స్వయంగా పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.

జులై 25 నుంచి కాంవడ్‌ యాత్రకు భక్తులు వెళ్లేందుకు యూపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యాత్రికులు తమ వెంట ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్‌ను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. అయితే అటు ఉత్తరాఖండ్ సర్కారు మాత్రం.. ఈ కాంవడ్‌ యాత్రను రద్దు చేసింది. యాత్రికులు అధికంగా గుమికూడితే కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. కాగా.. కాంవడ్ యాత్రలో భాగంగా ఏటా శ్రావణ మాసంలో 15 రోజుల పాటు శివభక్తులు గంగానదీ జలాలను సేకరిస్తుంటారు.

మరోవైపు.. కరోనా థర్డ్‌వేవ్ కట్టడికి ముందస్తు చర్యలు చేపట్టాలని మంగళవారం ఈశాన్య రాష్ట్రాల సీఎంలకు ఆదేశించారు. పర్యాటకులపై నిషేధం విధించాలని సూచించారు. ప్రధాని మోదీ చెప్పి 24 గంటలు గడవకముందే యూపీ సీఎం యోగి.. కాంవడ్ యాత్రకు అనుమతి ఇవ్వడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోదీ ఆదేశాలను సీఎం యోగి సహా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలే పట్టించుకోవడం లేదని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story