సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర వ్యవసాయ చట్టాల అమలుపై స్టే

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర వ్యవసాయ చట్టాల అమలుపై స్టే
మళ్లీ ఆర్డర్ వచ్చేంతవరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సాగుచట్టాలపై స్టే విధించింది. మళ్లీ ఆర్డర్ వచ్చేంతవరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.. రైతుల ఆందోళనలపై కేంద్రం అభ్యంతరాలను సుప్రీం తోసిపుచ్చింది..అటు రైతుల ఆందోళనలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతానికి కొత్త చట్టాల అమలు స్టే విధిస్తున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది.

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ కమిటీ ఉద్దేశం ప్రభుత్వాన్ని శిక్షించడం కాదని.. కేవలం ధర్మాసనానికి నివేదిక సమర్పించేందుకేనని తెలిపింది. అలాగే క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నామని అభిప్రాయపడింది. కమిటీని నియమించే అధికారం తమకు ఉందని ధర్మాసనం పేర్కొంది. కావాలంటే చట్టాలను నిలిపివేసే అధికారం కూడా ఉందని తెలిపింది. అవసరమైతే ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామంది. కొత్త సాగు చట్టాలు, రైతుల ఆందోళనలపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది.

రైతుల సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. అందుకోసమే కమిటీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. సమస్య పరిష్కారం కావాలనుకునే వారంతా కమిటీని సంప్రదించాలని సూచించింది. రైతులు నేరుగా లేదా తమ తరఫున న్యాయవాదుల ద్వారా సమస్యలను కమిటీకి వివరించాలని తెలిపింది. అయితే, రైతులు కమిటీ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరని వారి తరఫున న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ ధర్మాసనానికి తెలియజేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. అలాంటి మాటలు వినడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కావాలంటే అభిప్రాయాలు చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు. రైతుల ఆందోళనపై వ్యవహరిస్తున్న విధానం సవ్యంగా లేదంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సోమవారం సుప్రీంకోర్టు నిలదీసింది. పరిస్థితులు విషమిస్తూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చర్చల వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

అయితే సుప్రీం కోర్టు స్టే కేవలం కంటితుడుపు చర్యేనని అంటున్నారు రైతులు.. కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేసినప్పుడే అసలైన విజయం సాధించినట్లు అని స్పష్టం చేశారు.


Tags

Read MoreRead Less
Next Story