Hindu Succession Act: భర్త ఆస్తిలో భార్య పుట్టింటి వారికీ హక్కు: సుప్రీం సంచలన తీర్పు

Hindu Succession Act: భర్త ఆస్తిలో భార్య పుట్టింటి వారికీ హక్కు: సుప్రీం సంచలన తీర్పు
Hindu Succession Act: మహిళ తన భర్త ఆస్తిలో తన వాటాను తన సోదరుడి కొడుకుకు అనుకూలంగా బదిలీ చేయాలన్న నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడంతో ఉన్నత న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది.

మహిళల ఆస్తిహక్కు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. భర్తనుంచి సంక్రమించిన ఆస్తిని భార్య తన పుట్టింటి వారికి కూడా ఇవ్వొచ్చని సుప్రీం తీర్పు వెల్లడించింది. వారసత్వ చట్టంలోని సెక్షన్ 15.1డీ ప్రకారం.. మహిళ పుట్టింటి సభ్యులు కూడా వారసులవుతారని స్పష్టం చేసింది.

ఆమె ఆస్తులకు పుట్టింటి వారు కూడా భాగస్వామ్యులని పేర్కొంది. జగ్నోఅనే మహిళకు సంబంధించిన ఆస్తి కేసు విచారణలో ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే జగ్నో భర్త షేర్ సింగ్ 1953లో మరణించారు. వీరికి సంతానం లేదు. అతడి మరణం తర్వాత ఆమెకు వారసత్వంగా కొంత భూమి సంక్రమించింది.

ఆమె తనకు పిల్లలు లేకపోవడంతో తన ఆస్తులను తమ్ముడి కొడుకులకు అప్పగించాలని అనుకుంది. కానీ ఆమె మరిది కుమారుడు (షేర్ సింగ్ సోదరుడి కొడుకు) అభ్యతరం వ్యక్తం చేస్తూ 1991లో కోర్టుకు వెళ్లాడు.

ఆ ఆస్తులకు తామే వారసులమని, వారసత్వ హక్కు తమకే ఉంటుందని కోర్టుకు వివరించాడు. వదిన తన పుట్టింటి వారికి ఆస్తిని ఇచ్చే హక్కు లేదని వాదించాడు. సివిల్ కోర్టులో జగ్నోకు అనుకూలంగా తీర్పు రావడంతో.. అతడు హైకోర్టుకు అపీల్ చేసుకున్నాడు. అక్కడా చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

కేసు విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం.. హిందూ మహిళ తరపు వారసులను బయటివారుగా భావించకూడదు అని స్పష్టం చేసింది. కుటుంబం అనే పదాన్ని విస్తృత అర్థంలో చూడాలని వివరించింది.

అంతేకాదు ఇప్పటికే హక్కులను సృష్టించిన ఆస్తిపై ఏదైనా సిఫారసు డిక్రీ ఉంటే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 17.2 కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు జగ్నో మరిది దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది.

Tags

Read MoreRead Less
Next Story