తమిళనాడులో బీజేపీకి షాక్.. ఆ డిమాండ్‌‌‌‌‌కి అన్నాడీఎంకే నో...!

తమిళనాడులో బీజేపీకి షాక్..  ఆ డిమాండ్‌‌‌‌‌కి అన్నాడీఎంకే నో...!
తమిళనాడులో తన రాజ్యమే నడుస్తోందనుకుంటున్న బీజేపీకి షాక్‌ తగిలింది. నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగడంతో పొత్తులు, సీట్ల పంపకాలకు తెరలేపింది బీజేపీ.

తమిళనాడులో తన రాజ్యమే నడుస్తోందనుకుంటున్న బీజేపీకి షాక్‌ తగిలింది. నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగడంతో పొత్తులు, సీట్ల పంపకాలకు తెరలేపింది బీజేపీ. ప్రాతినిధ్యమే లేని తమిళనాడులో బీజేపీ అప్పుడే దూకుడుగా వెళ్తోంది.

60 సీట్లు కావాలంటూ అన్నాడీఎంకేను డిమాండ్ చేస్తోంది. కాని, అన్నాడీఎంకే మాత్రం అన్ని సీట్లు ఇవ్వడం కష్టమంటూ తేల్చిపారేసింది. అందులోనూ అమిత్‌షా తమిళనాడులో పర్యటిస్తుండగానే.. వ్యతిరేకగళం వినిపించింది. దీంతో బీజేపీని కాదని వ్యవహరిస్తున్న అన్నాడీఎంకేపై బీజేపీ పెద్దలు ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నై వచ్చిన అమిత్‌షా.. సీఎం పళనిస్వామి, పన్నీర్‌ సెల్వంతో అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. కాని, రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో వచ్చే సమావేశంలో బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తామో చెబుతామంటూ అన్నాడీఎంకే ప్రకటించింది. మరోవైపు దేశవ్యాప్తంగా మోదీ హవా ఉందని చెప్పుకుంటున్న బీజేపీ... తమిళనాడులో తమ బలం, బలగం పెంచుకున్నామని వాదిస్తోంది.

బీజేపీకి ఓటు బ్యాంక్ పెరిగింది కాబట్టే 60 సీట్లు కావాలని కోరుతున్నట్లు చెప్పుకొచ్చింది. బీజేపీ ఎన్ని చెప్పినా.. 60 సీట్లు ఇచ్చేది లేదంటోంది అన్నాడీఎంకే. మరోవైపు అన్నాడీఎంకే కూటమిలో పీఎంకే కూడా భాగస్వామే. ఈ పార్టీకి 23 సీట్లు ఇవ్వాలని భావిస్తోంది. పైగా విజయ్‌కాంత్‌ సారథ్యంలోని డీఎండీకేను కూడా కూటమిలో చేర్చుకోవాలనుకుంటోంది. ఏరకంగా చూసినా బీజేపీకి 21 స్థానాలకు మించి ఇవ్వలేమన్నది అన్నాడీఎంకే వాదన. అటు 170 నుంచి 180 స్థానాల్లో పోటీ చేసేందుకు అన్నాడీఎంకే సిద్ధమవుతోంది.

తమిళనాడులో అధికార పార్టీని నడిపిస్తున్నామనే భావనలో ఉన్న బీజేపీ... సీట్ల విషయంలో ఇలా బేరాలాడడం, అన్నాడీఎంకే అంగీకరించకపోవడంతో ఈ పరిణామాలను తట్టుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అన్నాడీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. మిగతా భాగస్వామ్య పార్టీలతో చర్చించి.. ఎవరికెన్ని సీట్లు కేటాయించాలో నిర్ణయం తీసుకుంటామని అన్నాడీఎంకే చెప్పుకొచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story