సోనూ సూద్ ఫ్రీ అంబులెన్స్ సర్వీస్.. 'ట్యాంక్ బండ్ శివ'కు ఇల్లు

సోనూ సూద్ ఫ్రీ అంబులెన్స్ సర్వీస్.. ట్యాంక్ బండ్ శివకు ఇల్లు
తనకు స్ఫూర్తి ప్రదాత అయిన సోనూ సూద్ పేరును అంబులెన్స్‌కు పెట్టుకున్నానని శివ వెల్లడించారు.

సోనూసూద్ నటుడిగా సంపాదించిన పేరుకన్నా ఆపన్నులను ఆదుకోవడంలో ఆయన చూపిస్తున్న చొరవ అందిరి హృదయాల్లో చోటు సంపాదించేలా చేసింది. ఆయన పేరిట క్యాంటిన్లు, షాపులు వెలుస్తున్నాయి. తాజాగా హైదరాబాదులో ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభమైంది. ట్యాంక్ బండ్‌ శివగా పేరు పొందిన శివ ఈ ఉచిత అంబులెన్స్ సర్వీసును నడపనున్నారు.

సోనూసూద్ ఈ అంబులెన్స్ సర్వీస్‌ను ప్రారంభించారు. ఈ అంబులెన్స్ ద్వారా జంటనగరాల్లోని పేద ప్రజలకు ఉచిత సేవలు అందించనున్నారు. దాతల సాయంతో ఈ అంబులెన్స్‌ను కొనుగోలు చేశానని, తనకు స్ఫూర్తి ప్రదాత అయిన సోనూ సూద్ పేరును అంబులెన్స్‌కు పెట్టుకున్నానని శివ వెల్లడించారు.

హుస్సేన్ సాగర్ ఏరియాలో శవాల శివగా పేరుగాంచిన శివ.. సాగర్‌లో గల్లంతైన మృతదేహాలను వెలికి తీయడంలో లేక్ పోలీసులకు సహకరిస్తుంటారు. 23 ఏళ్లుగా ఈ పనిలోనే ఉన్న శివ హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన 114 మంది ప్రాణాలు కాపాడారు.

నిరుపేద కుటుంబంలో ఉండి, నిలువ నీడ లేక పోయిన సాయం కోరి వచ్చిన వారిని కాదనలేరు. శివ చేస్తున్న సేవ గురించి తెలుసుకున్న ఒక దాత ఆయనకు మారుతీ సుజుకీ ఈకో వాహనం ఇచ్చారు. దాన్ని కూడా ఉచిత అంబులెన్స్‌గా మార్చి సేవ చేస్తున్నారు. ఒక్క వాహనం సాయం చేసేందుకు సరిపోవట్లేదని.. అందుకే దాతల సాయంతో మరో వాహనం కొనుగోలు చేసినట్లు చెప్పారు.

లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందికి సాయం చేసి తనలాంటి వారికి స్ఫూర్తిగా నిలిచిన సోనూ సూద్ పేరును ఈ అంబులెన్స్‌కు పెట్టానని అన్నారు. కాగా శివకు ఇల్లు లేదని తెలుసుకున్న సోనూసూద్ తాను ఇల్లు కట్టించి ఇస్తానన్నారని శివ వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story