బడికెళ్లకుండానే పది పరీక్షలు.. సర్కార్ యోచన

బడికెళ్లకుండానే పది పరీక్షలు.. సర్కార్ యోచన
ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో చదువు మానేయకుండా పదో తరగతి పరీక్షలు రాసే అవకాశాన్ని..

కరోనాతో విద్యా వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. పాఠశాలల్లో చేరి నెల నెలా ఫీజు కడితేనే పరీక్షలు రాయడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులకు. కానీ కరోనాతో ఆదాయాన్ని కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వారికి వెసులు బాటుగా ఉండేందుకు నేరుగా ఎస్ఎస్‌సీ బోర్డుకు ఫీజు చెల్లించి పది పబ్లిక్ పరీక్షలు రాయించే అవకాశాన్ని కల్పించాలని యోచిస్తోంది విద్యాశాఖ. అన్ని వర్గాల అభిప్రాయాన్ని సేకరించి ఈ విద్యా సంవత్సరానికి గాను ఈ నిర్ణయాన్ని అమలు పరచాలనుకుంటోంది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో చదువు మానేయకుండా టీవీ పాఠాలతో చదువుకుంటూ పదో తరగతి పరీక్షలు రాసే అవకాశాన్ని ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు. దీనిపై జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వస్తే విద్యార్థులు నేరుగా బోర్డుకు పరీక్ష రుసం చెల్లించి హాల్ టికెట్ పొందొచ్చు. తద్వారా పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. విద్యా సంవత్సరం వృధా కాకుండా ఉంటుంది.

2015లో ఇలాంటి సదుపాయం ఉండేది. పాఠశాలల్లో నిర్వహించే అసైన్‌మెంట్లలో వచ్చే అంతర్గత మార్కులను (సబ్జెక్టు 20 మార్కులు) కూడా పరిగణలోకి తీసుకోవడంతో విద్యాశాఖ దాన్ని రద్దు చేసింది. ఈసారి ఆ మార్కులను రద్దు చేసే నిర్ణయం తీసుకుంటే, నేరుగా పరీక్ష రాసే విధానం అమలు చేయవచ్చని కొందరు సూచినట్లు సమాచారం. అంటే విద్యా సంవత్సరంలో జరిగే నాలుగు ఫార్మేటివ్ అసెస్‌మెంట్లు (ఎఫ్ఏ) లను రద్దు చేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయానకి రావాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం దాదాపుగా 5 లక్షల మంది విద్యార్థులు పదవతరగతి పరీక్షలు రాస్తారు. వారిలో 3 లక్షల మంది ప్రవేటు పాఠశాలల విద్యార్థులే ఉంటారు. వారికోసం ఈ వెసులు బాటు కల్పించాలని భావిస్తోంది విద్యాశాఖ.

Tags

Read MoreRead Less
Next Story