దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం సన్నాహాలు.. ఏపీలో డ్రైరన్‌

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం సన్నాహాలు.. ఏపీలో డ్రైరన్‌
ఇండియాలో ఎనిమిది కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మూడు స్వదేశీ వ్యాక్సిన్లు ఉన్నాయి

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ముందస్తుగా నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్‌ నిర్వహిస్తోంది. ఏపీలో ఇవాళ, రేపు కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ చేపట్టనున్నారు. ఇందుకోసం కృష్ణా జిల్లాలోని 5 కేంద్రాలను సిద్ధం చేశారు. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రి, పూర్ణ ఆసుపత్రి, ఉప్పులూరులోని పీహెచ్‌సి, ప్రకాష్ నగర్ అర్బన్ పీహెచ్‌సి, పెనమలూరులోని పీహెచ్‌సిలో డ్రైరన్ నిర్వహిస్తున్నారు. ఒక్కో సెంటర్‌లో 25 మందికి డమ్మీ ట్రయల్స్ నిర్వహిస్తారు. కోవిన్‌ యాప్‌ ద్వారా పేర్లు నమోదు చేసిన వ్యక్తులలో కొందరిని సెలక్ట్ చేసి డ్రైరన్ చేపడుతున్నారు. మాములుగా వ్యాక్సినేషన్ సమయంలో రోజుకు వందమందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ట్రయల్ రన్ కాబట్టి ఒక్కో సెంటర్ లో 25 మందికి చొప్పున వ్యాక్సిన్ ట్రయల్స్ ఇవ్వబోతున్నారు. ఈ డ్రైరన్ తరువాత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది.

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ డ్రైరన్‌ సెంటర్‌లో ఏర్పాట్లను కలెక్టర్‌ ఇంతియాజ్‌ పరిశీలించారు. ఇవాళ ఐదు కేంద్రాల్లో నిర్వహించే డ్రైరన్‌ ప్రక్రియ మొత్తం వీడియో తీసి రాష్ట్ర, జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌లకు అందిస్తామని చెప్పారు. ఇప్పటికే మచిలీపట్నం డ్రగ్స్‌ స్టోర్స్‌ నుంచి డమ్మీ వ్యాక్సిన్‌ బాక్సులను విజయవాడకు తరలించారు. డ్రైరన్‌లో ఎవరికీ వ్యాక్సిన్‌ వేయరని, ఇదొక మాక్‌ డ్రిల్‌ లాంటిదని చెప్పారు. రెండు రోజుల పాటు నిర్వహించే డ్రైరన్‌లో కొ-విన్‌ యాప్‌ పనితీరును ఆరోగ్య కార్యకర్తలు తెలుసుకుంటారని తెలిపారు. వ్యాక్సినేషన్‌కు అవసరమైన ఆరోగ్య కార్యకర్తల బృందాన్ని గుర్తించి ఆ జాబితాను ఈ యాప్‌లో పొందుపరుస్తామని వివరించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించారు. మెడికల్‌ ఆఫీసర్లు, వ్యాక్సినేటర్లు, కోల్డ్‌చైన్‌ నిర్వాహకులు, సూపరవైజర్లు, డేటా మేనేజర్లు, ఆశా కోఆర్డినేటర్లతో పాటు వ్యాక్సిన్‌ పంపిణీలో భాగస్వాములైన వాళ్లందరకి డ్రైరన్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.

కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కోసం కేంద్రం సన్నాహాలు మొదలుపెట్టింది. ముందస్తుగా నాలుగురాష్ట్రాల్లో దీనికి సంబంధించి ముందుగా డ్రైరన్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఇవాళ రేపు ఏపీ సహా పంజాబ్‌, గుజరాత్‌, అసోం రాష్ట్రాల్లో డ్రైరన్‌ నిర్వహించనున్నారు. ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైరన్‌లో భాగంగా కేంద్రప్రభుత్వ ప్రతినిధులు నిన్న విజయవాడ జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయాన్ని సందర్శించారు. వ్యాక్సిన్‌ పంపిణీకీ తీసుకుంటున్న చర్యలు, శీతలీకరణ తదితర అంశాలపై ఆరాతీశారు.

వ్యాక్సిన్‌ పంపిణీ కోసం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2వేల 360 మంది అధికారులకు శిక్షణ ఇచ్చారు. త్వరలో ఏడువేల మందికి శిక్షణ ఇవ్వబోతున్నారు. వ్యాక్సిన్‌ ఎవరికి ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? వ్యాక్సన్‌ను ఎలా స్టోర్‌ చేయాలన్న విషయంపై డ్రైరన్‌లో ప్రధానంగా దృష్టిపెడతారు. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వచ్చే జనాన్ని ఎలా నియంత్రించాలన్న విషయంపై కూడా శిక్షణ ఇవ్వనున్నారు. ఒకవేళ వ్యాక్సిన్‌ వికటిస్తే ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై కూడా డ్రైరన్‌లో భాగంగా ప్రత్యేక శిక్షణ ఉంటుంది.

ఇండియాలో ఎనిమిది కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మూడు స్వదేశీ వ్యాక్సిన్లు ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్ వివిధ దశలలో పూర్తి చేసుకుని ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. ఇందులో ఆస్ట్రాజెనెకా టీకా, సీరం సంస్థ నుంచి కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్, జైడస్ కాడిలా నుంచి జైకోవ్-డి, రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వి అందుబాటులో ఉన్నాయి.


Tags

Read MoreRead Less
Next Story