Afghanistan: జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు

Afghanistan: జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌ పునర్నిర్మాణం మా పని కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అమెరికా

ఆఫ్ఘనిస్తాన్‌ పునర్నిర్మాణం మా పని కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అమెరికా. అల్‌ఖైదా అంతమే తమ ఉద్దేశమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మా లక్ష్యం నెరవేరిందంటూ కుండబద్దలు కొట్టారు. 20 ఏళ్ల క్రితం బిన్‌ లాడెన్‌ను మట్టుబెట్టి.. అల్‌ఖైదా ప్రాబల్యాన్ని తగ్గించేశామని గొప్పగా చెప్పుకున్నారు. భవిష్యత్తులో ఆఫ్ఘనిస్తాన్‌ అనే ఒక దేశం నుంచి అమెరికాపై దాడి జరగకూడదనే ఉద్దేశంతో ఈ 20 ఏళ్ల పాటు పోరాడామన్నారు. అంతేతప్ప ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం అమెరికా మిషన్ కాదని తేల్చి చెప్పారు బైడెన్.

ఆఫ్ఘనిస్తాన్‌(Afghanistan)లోని కీలక ప్రభుత్వ భవనాలన్నీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌ను అదుపులోకి తీసుకున్న తాలిబన్లు.. పార్లమెంట్ భవనంలోకి కూడా ప్రవేశించారు. ఆఫ్ఘన్‌కు బహుమతిగా భారత్‌ కట్టించి ఇచ్చిన పార్లమెంట్‌లో తాలిబన్లు తుపాకులతో కూర్చున్న వీడియో సంచలనంగా మారింది. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం సంపూర్ణంగా ముగిసిందని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే ఆఫ్ఘన్‌ను ఇస్లామిక్ ఎమిరేట్‌గా ప్రకటిస్తామని తాలిబన్లు ప్రకటించారు. తాలిబన్ నేత అబ్దుల్ ఘనీ బరాదర్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

ప్రపంచం నివ్వెరపోయే సంఘటనలకు ఆఫ్ఘన్‌ కేంద్రంగా మారింది. విమాన రెక్కలపై కూర్చుని దేశం దాటి వెళ్దామని చేసిన ప్రయత్నం, గాల్లోంచి పడిపోయిన దృశ్యాలు కలచివేస్తున్నాయి. అమెరికా ఆర్మీ విమానం చక్రాలపై కూర్చుని.. దాదాపు కిలోమీటరు ఎత్తు నుంచి కిందపడిపోయిన హృదయవిదాకర దృశ్యాలు సంచలనం సృష్టించాయి. తాలిబన్ల గుప్పిట్లోకి ఆఫ్ఘన్‌ వెళ్లడంతో ప్రాణభయంతో పరుగులు పెట్టారు అక్కడి ప్రజలు.

ఇమ్మిగ్రేషన్ రూల్స్, వీసా, పాస్‌పోర్ట్‌ లాంటివేమీ లేకుండానే విమానాల్లోకి ఎక్కేందుకు ప్రయత్నించిన తీరు ఆశ్చర్య పరిచింది. ముఖ్యంగా ఆడవాళ్లకు నరకం చూపిస్తారన్న భయాలే ఇందుకు కారణం. 12 ఏళ్లు దాటిన ఆడపిల్లల్ని తాలిబన్లు ఎత్తుకుపోతారన్న భయంతో.. దేశం విడిచిపారిపోయేందుకు ప్రయత్నించారు. కాబుల్ ఎయిర్‌పోర్టులో జరిగిన తొక్కిసలాటలో 8మంది చనిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story