Yogi Adityanath: "నేను యోగిని, నా కాషాయ వస్త్రంపై అవినీతి మరక లేదు" ఎన్నికల వేళ సీఎం వీడియో సందేశం

Yogi Adityanath: నేను యోగిని, నా కాషాయ వస్త్రంపై అవినీతి మరక లేదు ఎన్నికల వేళ సీఎం వీడియో సందేశం
Yogi Adityanath: మీ ఓట్లు అడగడానికి నేను ఇక్కడికి రాలేదు...': పోలింగ్ రోజు వీడియో సందేశాన్ని విడుదల చేసిన యూపీ సీఎం యోగి

Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభం కానున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం తెల్లవారుజామున ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ట్విటర్‌లో యూపీ ప్రజలను ఉద్దేశించి తమ ప్రభుత్వం సాధించిన విజయాలను పేర్కొన్నారు. "మీ ఓట్లు అడగడానికి" తాను మాట్లాడడం లేదని పదేపదే పేర్కొన్నారు.

"ఇది మీరు తీసుకునే ఓ వ్యక్తిగత నిర్ణయం. గత ఐదేళ్లలో, బిజెపి ప్రభుత్వం ప్రతిదీ నిబద్ధతతో చేసింది. మాపై మీరు ఉంచిన నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని చేసిన వాగ్దానాలను నెరవేర్చింది. ఐదేళ్లలో చాలా జరిగింది గ్రామాల్లోని అన్ని ఇళ్లకు తొలిసారిగా 24 గంటల కరెంటు వచ్చింది. పరిశుభ్రతతో పాటు మహిళల గౌరవం కోసం బాత్‌రూమ్‌లు నిర్మించబడ్డాయి. పటిష్టమైన గృహాలు నిర్మించబడ్డాయి. ఇళ్లకు మంచినీళ్లు వస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించాం అని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే మరింత ఉత్సాహంగా ముందుకు వెళతామని పేర్కొన్నారు. మహమ్మారిపై ఆయన మాట్లాడుతూ, "రెండేళ్ల క్రితం, మహమ్మారి వచ్చినప్పుడు, ధనిక దేశాలు కూడా బాధపడ్డాయి. మాకు వ్యాధి మరియు ఆకలి రెండూ ఉన్నాయి. యూపీలో ఎవరూ ఆకలితో నిద్రపోకూడదని నిర్ణయించుకున్నాను. కోట్లాది మందికి రేషన్ ఇచ్చాం. భగవంతుని ఆశీర్వాదం మరియు ప్రధానమంత్రి దిశానిర్దేశంతో మేము దీన్ని చేయగలిగాము.

కుల, వర్గాలను దృష్టిలో పెట్టుకోకుండా తాను అన్ని నిర్ణయాలూ తీసుకున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. బీజేపీ పాలనలో అవినీతి, మాఫియా, నేరాలు, అల్లర్లు అన్నీ తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. "నేను యోగిని. నా కాషాయ వస్త్రంపై అవినీతి మరక లేదు" అని ఆయన అన్నారు.

చివరగా, ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడిన ఆయన, "గత ప్రభుత్వాలు నెలకొల్పిన అన్ని రికార్డులను మేము బద్దలు కొట్టాము. నేను మీ ఓట్లు అడిగేందుకు ఇక్కడకు రాలేదు కానీ మీకు ఇవన్నీ చేయని గత ప్రభుత్వాలకు క్షమాపణలు చెప్పడానికి"వచ్చాను అని అన్నారు. "నా ఏకైక ఆందోళన ఏమిటంటే, ఈ వ్యక్తులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు చెప్పే మాటలకు తలొగ్గితే నా ఐదేళ్ల శ్రమ వృథా అయిపోతుంది. యూపీ కాశ్మీర్, బెంగాల్, కేరళలా తయారవుతుంది. మీ మంచి జీవితానికి మీ ఓటు గ్యారెంటీ అవుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని సీఎం యూపీ ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు.

గురువారం ఉదయం, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ రోజు సంభాల్ జిల్లాలో ఉంటానని ట్వీట్ చేశారు. 'బేటీ బచావో బేటీ పఢావో' సంకల్పంతో బీజేపీ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని, సంభాల్‌లోని గున్నౌర్ నియోజకవర్గంలో ప్రభుత్వ బాలికల కళాశాల నిర్మాణం ఇందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు.

ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి గురించి ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసిందని, ప్రతి వర్గాన్ని జనజీవన స్రవంతితో అనుసంధానం చేసేందుకు కృషి చేసిందని అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం ప్రారంభమైంది. తొలి దశలో యూపీలోని 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. తొలి దశలో 623 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఈ దశలో 2.27 కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులు. మొదటి దశలో పశ్చిమ యుపి ప్రాంతం, దోబ్‌లో ఓటింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించనున్నారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Tags

Read MoreRead Less
Next Story