అధిష్టానం ఆదేశాలతో సీఎం పదవికి రాజీనామా చేసిన త్రివేంద్ర సింగ్‌ రావత్‌

అధిష్టానం ఆదేశాలతో సీఎం పదవికి రాజీనామా చేసిన త్రివేంద్ర సింగ్‌ రావత్‌
సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ పదవి నుంచి తప్పుకున్నారు

ఉత్తరాఖండ్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ పదవి నుంచి తప్పుకున్నారు. రాష్ట్ర గవర్నర్‌ బేబీ రాణి మౌర్యను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. రాజకీయాల్లో ఎంతోకాలంగా పనిచేస్తున్నానని.. నాలుగేళ్ల పాటు రాష్ట్రానికి సేవే చేసే సువర్ణావకాశం లభించిందన్నారు రావత్‌. తాను చిన్న గ్రామం నుంచి వచ్చానని.. కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలకు కూడా ఇలాంటి గొప్ప అవకాశాలు రావడం కేవలం బీజేపీలోనే సాధ్యమన్నారు. ఇప్పుడు అదే పార్టీ ఈ అవకాశాన్ని మరొకరికి ఇవ్వమని చెప్పిందని... ఈ పదవిని ఎవరు చేపట్టినా వారికి సహకరిస్తానని పేర్కొన్నారు.

అయితే.. రావత్‌ నాయకత్వంపై రాష్ట్ర బీజేపీ నేతల్లో కొంతకాలంగా అసంతృప్తి నెలకొన్నట్లు వార్తలు వచ్చాయి. సీఎం మార్పు కోరుతూ గత కొన్ని రోజులుగా కనీసం పదిమంది పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఢిల్లీలో మకాం వేసినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన అధిష్ఠానం ఇటీవల ఇద్దరు సీనియర్‌ నేతలను రాష్ట్రానికి పంపింది. రాష్ట్ర కోర్‌ సభ్యులతో సమావేశమైన వారు.. ఆ నివేదికను జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు సమర్పించారు. సోమవారం ఢిల్లీ వెళ్లి బీజేపీ అధిష్ఠానాన్ని కలిశారు రావత్‌. పదవి నుంచి దిగిపోవాలని పార్టీ పెద్దలు రావత్‌కు సూచించినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం ఆదేశాలతో ఆయన రాజీనామా చేశారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో త్రివేంద్ర సింగ్‌ రావత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

రావత్‌ స్థానంలో ఎమ్మెల్యే ధన్‌సింగ్‌ రావత్‌కు రాష్ట్ర పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తదుపరి సీఎం ఎంపిక నిమిత్తం పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బన్సీధర్‌ భగత్‌ వెల్లడించారు. 48 ఏళ్ల ధన్‌సింగ్‌ .. శ్రీనగర్‌ గఢ్వాల్‌ నుంచి తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. సీఎం రేసులో ఇంకా చాలా మంది ఉన్నారు. టూరిజం మంత్రి సత్పాల్ మహరాజ్, కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిషాంక్, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అజయ్ భట్, మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, ఉత్తరాఖండ్ రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూని, ఆర్‌ఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సురేష్ భట్ ఉన్నట్టు తెలుస్తోంది. అటు.. వచ్చే ఏడాది ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలూ జరగనున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story