త్వరలో హస్తినకు వెళ్లనున్న రాములమ్మ!

త్వరలో హస్తినకు వెళ్లనున్న  రాములమ్మ!

కాంగ్రెస్‌ను వీడతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. విజయశాంతి వరుసగా పత్రికా ప్రకటనలో రాజకీయ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ భవిష్యత్‌ను కాలం, ప్రజలే నిర్ణయించాలని సంచలన ప్రకటన చేసిన ఆమె.. తాజాగా దుబ్బాక ఎన్నిక ఫలితాల నేపథ్యంలో... అధికార టీఆర్‌ఎస్‌ను తీవ్రస్థాయిలో విమర్శించారు. దుబ్బాక ఉపఎన్నిక తీర్పు... టీఆరెస్ అహంకారపూరిత ధోరణులకు... నిరంకుశ పోకడలకు జవాబు అని అన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు దుబ్బాక ఓటర్లు ప్రభావితం కాకుండా.. పాలకులపై వ్యతిరేకతను తమ ఓట్లతో స్పష్టం చేశారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ నేతలు ఏది చెబితే అది నమ్మే స్థితిలో లేరని విజయశాంతి వ్యాఖ్యానించారు. మలిదశ ఉద్యమ ప్రారంభానికి దుబ్బాక ప్రజలు ఊపిరులూదారని అన్నారు. చైతన్యపూరితమైన తెలంగాణ సమాజం పోరాటంతో కుటుంబ పాలనకు సమాధానం చెబుతారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మరోవైపు... విజయశాంతి మళ్లీ కాషాయ కండువాకప్పుకోవడం దాదాపు ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 24న బీజేపీలో చేరనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీలో చేరికపై ఆ పార్టీ నేతలతో విజయశాంతి చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది. కేంద్రమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మేరకు విజయశాంతి త్వరలో హస్తిన పయనం కానున్నారని తెలుస్తోంది.

విజయశాంతికి బీజేపీతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె రాజకీయ జీవితాన్ని బీజేపీతోనే ప్రారంభించారు. భారతీయ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చి.. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. టీఆర్‌ఎస్ నుంచి 2009 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌తో విభేదాలు రావడంతో 2014లో కాంగ్రెస్‌లో చేరారు. మళ్లీ రాములమ్మ పయనం బీజేపీ వైపే అనే ప్రచారం నేపథ్యంలో.. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story