VK Sasikala : శశికళ ఎంట్రీ మామూలుగా లేదు.. ఎంట్రీని ఓ రేంజ్‌లో ప్లాన్‌ చేసుకున్న శశికళ

VK Sasikala : శశికళ ఎంట్రీ మామూలుగా లేదు.. ఎంట్రీని ఓ రేంజ్‌లో ప్లాన్‌ చేసుకున్న శశికళ

VK Sasikala flaunts AIADMK flag

VK Sasikala : శశికళ ఎంట్రీ మామూలుగా లేదు. భారీ కాన్వాయ్, అభిమానులు కార్యకర్తల కోలాహలం మధ్య తమిళనాడులో అడుగుపెట్టారు.

VK Sasikala : శశికళ ఎంట్రీ మామూలుగా లేదు. భారీ కాన్వాయ్, అభిమానులు కార్యకర్తల కోలాహలం మధ్య తమిళనాడులో అడుగుపెట్టారు. నాలుగేళ్ల జైలు జీవితం తరువాత తమిళనాడుకి వస్తుండడంతో.. తన ఎంట్రీని కూడా ఆ రేంజ్‌లోనే ప్లాన్‌ చేసుకున్నారు. ఆ ఉదయం బెంగళూరు ఫామ్‌ హౌస్‌ నుంచి బయల్దేరిన శశికళ.. జయలలిత ఉపయోగించిన కారులో ప్రయాణించారు. తమిళనాడు సరిహద్దు నుంచి భారీ కాన్వాయ్‌తో ఎంట్రీ ఇచ్చారు.

తమిళనాడులోకి రాగానే ముందుగా హోసూరులోని ముత్తు మరియమ్మన్‌ టెంపుల్‌కు వెళ్లారు. అప్పటి వరకు ఉపయోగించిన కారును పక్కన పెట్టి.. అన్నాడీఎంకే జెండా ఉన్న కారులోకి ఎక్కారు. శశికళ ప్రయాణిస్తున్న కారుపై అన్నాడీఎంకే జెండా ఉండడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ పార్టీ నేతలు. శశికళకు, అన్నాడీఎంకేకు సంబంధమే లేదని చెబుతున్నారు.

శశికళ వస్తుండడంతో చెన్నై శివారులోని నజ్రర్‌పేటలో 100 మంది పోలీసులను మోహరించారు. శశికళకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన బ్యానర్లు, హోర్డింగులను పోలీసులు తొలగించారు. దీనిపై పోలీసులు, AMMK కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో 30 మంది AMMK కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

మరోవైపు అన్నాడీఎంకే పార్టీ హెడ్‌ ఆఫీసు వైపు వెళ్లే రహదారులను పోలీసులు మూసేశారు. పార్టీ ఆఫీసుకు వెళ్లే అన్ని దారుల్లోనూ బారీకేడ్లు పెట్టారు. ఇక ఎంజీఆర్ సమాధి వద్ద కూడా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. శశికళ చెన్నై చేరుకోగానే తొలి కార్యక్రమంగా ఎంజీఆర్‌ నివాళి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎంజీఆర్ నివాసం ఎదురుగా ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. జయలలిత సమాధి వద్ద మెయింటనెన్స్‌ పనులు జరుగుతున్నందున సందర్శకులకు అనుమతించడం లేదు. బీచ్‌ రోడ్డులోకి సాధారణ ప్రజలను కూడా అనుమతించడం లేదు.

చెన్నై వరకూ శశికళకు స్వాగతం పలికేందుకు మదురై, తేని, దిండుగల్‌, తిరుచ్చి, తిరునల్వేలి, తూత్తుకుడి, పుదుకోట, శివకాశి, చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు, కృష్ణగిరి జిల్లాలకు చెందిన అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం నేతలు, పార్టీ ప్రముఖులు రెడీగా ఉన్నారు. శశికళ ప్రయాణించే మార్గంలో ఎనిమిది రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. చండీమేళం, డ్రమ్స్‌ వాద్యం, బ్యాండ్‌ మేళం, మంగళవాయిద్యంతో ఆమెకు స్వాగతం పలుకనున్నారు.

అక్కడక్కడా కీలుగుర్రాల ప్రదర్శన, నెమలి నృత్యాలు, పులివేషాలు ఇలా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కృష్ణగిరి, తిరుపత్తూరు, వేలూరు, రాణిపేట, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల దాకా శశికళ ప్రయాణించడానికి పోలీసులు అనుమతించే అవకాశం ఉంది. చెన్నైలో ఈనెల 28 వరకు 144 సెక్షన్‌ ఉండడంతో శశికళ స్వాగత సత్కార సభలను పోలీసులు అడ్డుకుంటున్నారు. చెన్నైలో 20 చోట్ల స్వాగత సత్కార సభలు ఏర్పాటు చేయాలని AMMK నిర్వాహకులు నిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story