బంగ్లాదేశ్ విముక్తి కోసం జైలుకెళ్లా : ప్రధాని మోదీ

బంగ్లాదేశ్ విముక్తి కోసం జైలుకెళ్లా : ప్రధాని మోదీ
బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం తాను చేసిన సత్యాగ్రహం.. తన రాజకీయ జీవితం తొలినాళ్లలో చేసిన పోరాటాల్లో ఒకటని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం తాను చేసిన సత్యాగ్రహం.. తన రాజకీయ జీవితం తొలినాళ్లలో చేసిన పోరాటాల్లో ఒకటని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తన రాజకీయ జీవితంలో కూడా బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటం చాలా ముఖ్యమైనదని అన్నారు. తన సహచరులతో కలిసి భారతదేశంలో సత్యాగ్రహం చేశానని తెలిపారు.

అప్పట్లో తన వయసు ఇరవైలలో ఉండేదని.. ఈ సత్యాగ్రహం సందర్భంగా జైలుకు కూడా వెళ్ళానని పేర్కొన్నారు మోదీ. బంగ్లాదేశ్ 50వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఆ దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహోన్నత బంగ్లాదేశ్ సైనికులు, వారికి సహకరించిన భారతీయులు చేసిన గొప్ప త్యాగాలను ఎన్నటికీ మర్చిపోబోమని అన్నారు. వారి ధైర్య, సాహసాలు ఎన్నటికీ మరపురావని చెప్పారు.

ఢాకాలోని నేషనల్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బంగ్లాదేశ్ నేషనల్ డే ఉత్సవాల్లో మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పాల్గొన్నారు. తన జీవితంలో ఈరోజు చాలా ముఖ్యమైనదని, ఈరోజు ఎన్నటికీ గుర్తుండిపోతుందని చెప్పారు మోదీ. ఈ ఉత్సవాల్లో తనను భాగస్వామిని చేసినందుకు బంగ్లాదేశ్‌కు కృతజ్ఞతలన్నారు. అంతకుముందు మోదీ.. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్‌తో చర్చలు జరిపారు.

Tags

Read MoreRead Less
Next Story