కేంద్రం ఎత్తుకు పైఎత్తు వేసిన మమతా బెనర్జీ..!

కేంద్రం ఎత్తుకు పైఎత్తు వేసిన మమతా బెనర్జీ..!
కేంద్రం ఎత్తుకు పైఎత్తు వేసింది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. శాసన మండలిని తెరపైకి తెచ్చింది.

కేంద్రం ఎత్తుకు పైఎత్తు వేసింది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. శాసన మండలిని తెరపైకి తెచ్చింది. మండలి ఏర్పాటు కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది..ఎమ్మెల్సీగా ఉంటూ సీఎంగా కొనసాగేందుకు మమత ఈ ప్లాన్‌ను అమల్లో పెట్టినట్లు స్పష్టమవుతోంది..అందుకే మండలి ఏర్పాటు కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయితే మండలి ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తప్పనిసరి. మరి బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం ఆమోదముద్ర వేస్తుందా? లేక ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పక్కన పడేస్తుందా అన్నది ఉత్కంఠను రేపుతోంది.

ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎన్నికవకుండానే సీఎంగా కొనసాగుతున్నారు మమత. నందిగ్రామ్‌లో పోటీ చేసి ఓడిపోయిన మమతా బెనర్జీ...ఈ ఏడాది మే 4న సీఎంగా బాధ్యతలు స్వీకరించారు..నవంబర్ 4లోగా ఆమె తప్పనిసరిగా ఎమ్మెల్యేగా ఎన్నికకావాల్సి ఉంది. ప్రస్తుతం బెంగాల్‌లో భవానీపుర్‌ స్థానం ఖాళీగా ఉంది. ఇక్కడి నుంచి పోటీ చేసి గెలవాలని మమత భావించింది. కానీ కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ విముఖత వ్యక్తం చేస్తోంది. ఇప్పట్లో బైపోల్ నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు.. అటు ఆరు నెలల్లోగా చట్టసభకు ఎన్నిక కాకపోతే మమత రాజీనామా చేయాల్సి ఉంటుంది..అందుకే మండలిని తెరపైకి తీసుకొచ్చారు.

అసెంబ్లీలో సభ్యులుగా లేనివారు సీఎంగా ఎన్నికైతే గరిష్ఠంగా ఆరు నెలల్లోగా సభకు ఎన్నిక కావాలనేది రాజ్యాంగ నిబంధన. ఉత్తరాఖండ్‌లో అలాంటి అవకాశం లేక తీరథ్‌ సింగ్‌ రావత్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. అటు బెంగాల్‌లో ఖాళీగా ఉన్న భవానీపుర్‌ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించకుండా కరోనాను అడ్డు పెట్టుకుని ఎన్నికల సంఘాన్ని మోదీ సర్కారు నిలవరిస్తుందని టీఎంసీ నాయకులు విమర్శిస్తున్నారు. దీదీని దెబ్బ కొట్టాలన్న ముందస్తు వ్యూహంలో భాగంగానే బీజేపీ.. ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు జరపకుండా సీఎంను కావాలనే మార్చిందనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. బీజేపీ వేసిన ఈ పాచికకు దీదీ చెక్ పెట్టిందని అంటున్నారు టీఎంసీ నేతలు..బైపోల్ గండం నుంచి గట్టెక్కి తన సీఎం పదవిని కాపాడుకోవడంతోపాటు..కేంద్రానికి షాక్ ఇచ్చేందుకే మండలిని తెరపైకి తెచ్చిందంటున్నారు విశ్లేషకులు.

గతంలో కొందరు మంత్రులు సభలో సభ్యులు కాకుండానే పదవి చేపట్టి, ఆరు నెలలకు కొద్ది రోజుల ముందు రాజీనామా చేసి, మరోసారి ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా ఏడాది వరకు నెట్టుకురాగలిగారు. అలాంటిది చెల్లదని సుప్రీంకోర్టు 1995లో నిషేధం విధించింది. ఇలాంటి ఇబ్బందులన్నింటికీ చెక్‌ పెట్టేందుకే మమత మండలిని తెరపైకి తెచ్చింది. అయితే మండలి ఏర్పాటుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు మండలి ఏర్పాటును కోరుతూ తీర్మానాలు పంపినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కేంద్రం. పశ్చిమ బెంగాల్‌ విషయంలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరించొచ్చని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story