Yogi Adityanath Cabinet : యోగి క్యాబినెట్‌లో ఏకైక ముస్లిం మంత్రి..!

Yogi Adityanath Cabinet : యోగి క్యాబినెట్‌లో ఏకైక ముస్లిం మంత్రి..!
Yogi Adityanath Cabinet : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ నిన్న(మార్చి 25)న ప్రమాణ స్వీకారం చేశారు.

Yogi Adityanath Cabinet : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ నిన్న(మార్చి 25)న ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని వాజ్‌పేయి స్టేడియంలో అరంగంగవైభవంగా ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటుగా బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. యోగి ఆధిత్యనాథ్‌ చేత గవర్నర్‌ ఆనందీ బెన్‌ పటేల్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 52 మందితో యోగి ఆదిత్యనాథ్‌ తన కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. యోగి ప్రభుత్వంలో కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, బ్రజేష్‌ పాఠక్‌లు మరోసారి ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. మంత్రివర్గంలో ఈసారి యువతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు యోగి. దాదాపు 30 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. అలాగే ఐదుగురు మహిళా మంత్రులకు కూడా అవకాశం దక్కింది.

అయితే ఇందులో ఒకే ఒక్క ముస్లిం నేతకి మంత్రి వర్గంలో చోటు దక్కింది. ఆయన పేరు డానిష్ అజాద్ అన్సారి. యోగి గత ప్రభుత్వంలో మైనారిటీ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన మొహిసిన్ రజా స్థానంలో ఈసారి అన్సారికి చోటు కల్పించారు. బల్లియాకు చెందిన 32 ఏళ్ల డేనిష్ తన రాజకీయ జీవితాన్ని లక్నో విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా ప్రారంభించారు. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీలో ఆయన అనేక పదవులు నిర్వహించారు. 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉర్దూ భాషా కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు. ఇది మంత్రి హోదా కలిగిన పదవి.

ఇక గత కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న చాలా మంది పెద్దలను ఈ సారి తొలగించారు యోగి. శ్రీకాంత్ శర్మ, సతీష్ మహానా, మహేందర్ సింగ్, సిద్ధార్థ్ నాథ్ సింగ్, నీలకాంత్ తివారీ, మొహసిన్ రజా ఈసారి కేబినెట్‌కు దూరమయ్యారు. ఇటీవల యూపీ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించింది. బీజేపీ 255 స్థానాల్లో, దాని మిత్ర ప‌క్షాలు18 స్థానాల్లో గెలుపొందాయి. 273 సీట్ల మెజార్టీతో యూపీలో మరోసారి అధికారం చేపట్టింది బీజేపీ. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన యోగి ఆదిత్యనాథ్‌ రెండోసారి సీఎం పదవిని చేపట్టి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో పూర్తి పదవీకాలం పూర్తయిన తర్వాత 37 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి ముఖ్యమంత్రి యోగినే కావడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story