Yogi Adityanath : ఇవాళ సీఎంగా యోగి ఆదిత్యానాథ్ ప్రమాణ స్వీకారం

Yogi Adityanath : ఇవాళ సీఎంగా యోగి ఆదిత్యానాథ్ ప్రమాణ స్వీకారం
Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో సాయంత్రం నాలుగు గంటలకు ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆయనతో పాటు దాదాపు 50 మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిధిగా హాజరవుతారు. మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, బీజెపి అధ్యక్షులు జేపీ నడ్డా హాజరవుతున్నారు. రెండోసారి వరుసగా సీఎంగా పదవి చేపడుతుండటంతో అంత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమాణస్వీకారోత్సవానికి అత్యున్నత స్థాయి నేతలు, వ్యాపారవేత్తలు, సంఘ్‌పరివార్ ప్రముఖులు వస్తున్నారు. సినీనటులు అక్షయ్‌కుమార్, కంగనా రనౌత్, బోనీ కపూర్ వంటి వారికి ఆహ్వానాలు పంపించారు. బీజేపి నుంచి మెచ్చుకోళ్లు పొందుతున్న ది కశ్మీర్ ఫైల్స్ సినిమా బృందానికి కూడా పిలుపు వెళ్లింది. సినిమా దర్శకులు వివేక్ అగ్నిహోత్రి, ప్రధాన నటులు అనుపమ్ ఖేర్ సినిమా తరఫున వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పీఎం మోదీ, ఇతర ప్రముఖుల ఫోటోలతో పలు చోట్ల కటౌట్‌లు వెలిశాయి.

బీజేపీ శాసన సభాపక్షనేతగా ఎన్నికైన యోగి గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అంతకుముందు బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో యోగిని ప్రశంసల్లో ముంచెత్తారు హోంమంత్రి అమిత్‌షా. గత 37ఏళ్లలో యూపీలో ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదన్నారు. మోదీ సారథ్యంలో యోగి పేదల సంక్షేమానికి సంబంధించిన ప్రతి పనిని పూర్తిచేశారన్నారు.

యూపీలో సుపరిపాలనకు ప్రధాని మోదీయే తనకు మార్గనిర్దేశం చేశారన్నారు యోగి. 2017కు ముందు తనకు ఎలాంటి పరిపాలనా అనుభవం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గనిర్దేశం, విజయవంతమైన నాయకత్వం వల్లే సాధ్యమైందని చెప్పారు. మొత్తానికి.. యోగీ ప్రమాణస్వీకారం చేస్తుండటంతో... బీజేపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story