North Korea: నార్త్ కొరియాలో తొలి కరోనా కేసు.. కిమ్ కీలక నిర్ణయం..

North Korea: నార్త్ కొరియాలో తొలి కరోనా కేసు.. కిమ్ కీలక నిర్ణయం..
North Korea: కరోనా యావత్‌ ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేసింది. కోట్ల మందికి వైరస్‌ సోకడంతోపాటు లక్షల్లో మరణాలు సంభవించాయి.

North Korea: కరోనా వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేసింది.. కోట్ల మందికి వైరస్‌ సోకడంతోపాటు లక్షల్లో మరణాలు సంభవించాయి.. అయితే, ప్రపంచమంతా తలకిందులైనా నార్త్‌ కొరియాలోకి మాత్రం నిన్నటి వరకు కరోనా వైరస్‌ చొరబడలేకపోయింది.. ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ఆ దేశ ప్రభుత్వం పకడ్బందీ చర్యలే తీసుకుంది.. అయితే, ఆ రక్షణ వలయం ఇప్పుడు చెదిరిపోయింది.. ఉత్తర కొరియాలో మొట్టమొదటి కోవిడ్‌ కేసు నమోదైంది..

ప్యాంగ్యాంగ్‌లో జ్వరంతో బాధపడుతున్న రోగుల నుంచి శాంపిల్స్‌ సేకరించగా, ఫలితాలత్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌తో సమానంగా ఉన్నట్లు వచ్చాయి. ఈ విషయాన్ని అక్కడి అధికారిక కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ ధ్రువీకరించింది. కరోనా ముప్పును ముందే పసిగట్టి చాలా దేశాలు తమ పౌరులకు టీకాలు వేయించాయి.. భారత్‌లో రెండు డోసులతోపాటు బూస్టర్‌ డోసు కూడా ఇచ్చారు..

కానీ, కరోనా తమ దేశానికి రాబోదని నార్త్‌ కొరియా ప్రభుత్వం ఆదే పౌరులకు టీకాలు వేయించలేదు.. అదే సమయంలో 2020లో వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి నార్త్‌ కొరియా దాని సరిహద్దుల్లో వైరస్‌ దిగ్బంధనాన్ని విధించింది.. కానీ, అనూహ్యంగా ఇప్పుడు కరోనా వైరస్‌ చొరబడటంతో ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తమైంది.. అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఉన్నతాధికారులతో అత్యవసరంగా క్రైసిస్‌ పొలిట్‌ బ్యూరో సమావేశం నిర్వహించారు..

మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించాలని నిర్ణయం తీసుకున్నారు.. వైరస్‌ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలంతా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని కిమ్‌ హెచ్చరించారు. అటు కరోనా కేసు నమోదైన ప్యాంగ్యాంగ్‌, దాని సమీప ప్రాంతాలు రెండు రోజులపాటు లాక్‌ డౌన్‌లోకి వెళ్లిపోయాయి.. అయితే, నార్త్‌ కొరియాలో కరోనా కేసులు ఏ స్థాయిలో ఉన్నాయనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు..

తొలి కేసు నమోదైందని చెప్పినప్పటికీ.. మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని అక్కడి వైద్య వర్గాలు చెప్తున్నాయి.. ఇప్పటికే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న ఆ దేశ వైద్య వ్యవస్థ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందన్నది కూడా అనుమానంగానే ఉంది.. అటు అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ.. కరోనా వైరస్‌ ఆంక్షల కారణంగా మరింత ఇబ్బందుల్లో పడింది.. ఇలాంటి సమయంలో లాక్‌ డౌన్‌ విధించాల్సి రావడంతో ప్రజలకు మరిన్ని ఇబ్బందులు తప్పేట్టు లేవు..

Tags

Read MoreRead Less
Next Story