Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
యునైటెడ్ కింగ్డం తెలుగు సంఘం (UKTA) ప్రారంభోత్సవం
AA

లండన్, జూలై 18 2010: ఉన్నత విద్యని అభ్యసించటానికి బ్రిటన్ వచ్చే విద్యార్ధులకు తోడ్పాటు, స్వయం ఉపాధి తో ఎదగాలనుకునే వ్యాపారవేత్తలను లాభాపేక్ష లేకుండా ప్రోత్సహించే లక్ష్యం తో ఏర్పడిన యునైటెడ్ కింగ్డం తెలుగు సంఘం (యుక్త) ప్రారంభోత్సవం ఈ రోజు లండన్ లో భారతీయ విద్యా భవన్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భం గా సంస్థ నిర్వాహకులు పద్మ విభూషణ్ డా!!మంగళంపల్లి బాల మురళీ కృష్ణ కి సన్మానం జరిపారు. సంఘం అధ్యక్షులు ప్రభాకర్ కాజా మాట్లాడుతూ ఇక్కడికి వచ్చే విద్యార్ధులకు వివిధ రంగాల్లో ఉండే ఉపాధి అవకాశాలను వివరిస్తూ వారి అభ్యున్నతికి సహాయ సహకారాలను అందించటం, ఔత్సాహిక వాణిజ్య వేత్తలని ప్రోత్సహించటం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు. సభ కి గౌరవ అధ్యక్షులు గా వ్యవహరించిన ఆంధ్ర ప్రదేశ్ విధాన మండలి ఎన్న్నారై కార్యవర్గ అధ్యక్షులు డా !! చక్రపాణి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తం గా అన్ని రంగాల్లోనూ తెలుగు వారు సాధిస్తున్న విజయాలను అభినందించారు. మాతృభూమి కి దూరం గా ఉన్నా, ఇటువంటి సంస్థలు ముందుకి వచ్చి తోటి తెలుగు వారికి చేయూతని అందించటం తెలుగు వారి ఆత్మీయతని చాటి చెప్తోందని కొనియాడారు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య ఈ సందర్భంగా తన శుభాకాంక్షలు తెలియజేస్తూ తన సందేశం లో యుక్త కి తమ ప్రభుత్వ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. సన్మాన గ్రహీత డా!! మంగళంపల్లి బాలమురళీకృష్ణ మాట్లాడుతూ తనకి ఈ సాన్మానం మరువలేని అనుభూతిని ఇచ్చిందని సభ కి హాజరైన అందరిని ఈ నెల 31 న భారతీయ విద్యా భవన్ నిర్వహిస్తున్న తన కచేరికి రావాల్సిందిగా స్వయం గా ఆహ్వానించారు.

ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన టాటా కన్సల్టన్సి సర్వీసెస్ యూరోప్ అధినేత లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, విద్యార్ధుల ప్రతిభని గుర్తించి తదనుగుణంగా వారికి సరైన దారిని చూపించటానికి యుక్త నిర్వహించే వర్క్ షాపులు ఎంత గానో దోహదపడతాయని వాటిని చక్కగా ఉపయోగించుకోవాలని విద్యార్ధులకి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లో సంస్థ కోశాధికారి జయ కుమార్ గుంటుపల్లి, విద్యార్ధి సమన్వయకర్త సందీప్ నాదెండ్ల పాల్గొన్నారు. యుక్త కార్యదర్శి శ్రవణ్ లట్టుపల్లి వందన సమర్పణ చేశారు. ప్రపంచ వ్యాప్తం గా బ్రిటన్ రావాలనుకునే తెలుగు విద్యార్ధులు తమ సందేహాలను www.uktas.org.uk ద్వారా నివృత్తి చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. భారతీయ విద్యా భవన్ విద్యార్ధులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరి ప్రశంసలు అందుకున్నాయి.
Related Articles
Gallery