సినిమా షూట్ రెడీ..

సినిమా షూట్ రెడీ..
స్టార్ట్.. కెమెరా.. యాక్షన్ అనేలోపు ఎక్కడ కరోనా వచ్చి కట్ చెబుతుందో అని ఇన్ని రోజులు భయపడి షూటింగ్ లకు దూరంగా ఉంటోంది..

స్టార్ట్.. కెమెరా.. యాక్షన్ అనేలోపు ఎక్కడ కరోనా వచ్చి కట్ చెబుతుందో అని ఇన్ని రోజులు భయపడి షూటింగ్ లకు దూరంగా ఉంటోంది చిత్ర పరిశ్రమ. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసి వాటిని అనుసరిస్తూ షూటింగ్ లు మొదలు పెట్టవచ్చని పేర్కొంది. ఈ మేరకు మంత్రి ప్రకాశ్ జావ్ డేకర్ కొన్ని నిబంధనలు జారీ చేశారు. అంతర్జాతీయ అనుభవాలు, వైద్య ఆరోగ్య శాఖ, హోంశాఖ సలహాలు, సూచనలకు అనుగుణంగా ఈ నిబంధనలు జారీ చేశారు. కొన్ని లక్షలమందికి ఉపాధి కల్పించే చిత్ర రంగం దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రధానమైంది. దాదాపు నాలుగైదు నెలలుగా వారందరికీ ఉపాధి లేకుండా పోయింది. తాజా మార్గదర్శకాలను అనుసరించి, టీవీ సీరియళ్లను, సినిమా షూటింగ్ లను ప్రారంభించవచ్చు.

ఆదివారం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం, అధిక ప్రమాదం ఉన్న ఉద్యోగులు అదనపు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అందరూ కచ్ఛితంగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. పరిశుభ్రత నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఆరోగ్య సేతు యాప్ ను అందరూ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. షూటింగ్ జరిగే ప్రాంగణంలో కోవిడ్ లక్షణాలు లేని వ్యక్తులు మాత్రమే అనుమతించబడతారు. ఏ మాత్రం దగ్గు, జలుబు, జ్వరం లాంటి స్వల్పంగా ఉన్నా అనుమతి లేదు. సాధ్యమైనంతవరకు అన్ని సమయాల్లో ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి. సీరియల్ గానీ, సినిమా గాని జరిగే ప్రదేశంలో గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలా చూసుకోవాలి.

సందర్శకులను సెట్లలో అనుమతించకుండా ఉండేలా ప్రొడక్షన్ హౌస్‌ లు జాగ్రత్త వహించాలి. బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్ లు నిర్వహించడానికి స్థానిక అధికారులతో అవసరమైన సమన్వయం ఉండేలా చూడాలి. "సెట్లు, ఫలహారశాల, మేకప్ గదులు, వానిటీ వ్యాన్లు, వాష్‌రూమ్‌లు మొదలైన సాధారణ ప్రదేశాలు క్రమం తప్పకుండా శుభ్రపరచాలి. చిత్రీకరణకు ఉపయోగించే సున్నితమైన పరికరాలు, షూట్ చేయడానికి ముందు మరియు తరువాత, సాధ్యమైనంతవరకు శుభ్రపరచవలసి ఉంటుంది. చేతి గ్లవుజులు, బూట్లు, మాస్కులు, పిపిఇ కిట్లు మొదలైన వాటిని కచ్చితంగా ధరించాలి అని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story