యోగి సర్కారుకు ఊహించని ముప్పు..

యోగి సర్కారుకు ఊహించని ముప్పు..

ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కారుకు ఊహించని ముప్పు వచ్చి పడింది. రాజకీయంగా యోగి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయాలతో చతికిలపడిన విపక్షాలకు, యోగి సర్కారుపై చెలరేగిపోయే బ్రహ్మాండమైన అస్త్రం లభించింది. ఇదే అదనుగా ప్రతిపక్షాలు చెలరేగిపోయా యి. మాటల తూటాలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడుకున్నాయి.

రాజకీయంగా ఎప్పుడు ఏది కలసి వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ అడుగు వేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకావాద్రా అదే పని చేశారు. సోన్‌భద్ర జిల్లాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో 10 మంది మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక, వెంటనే రంగంలోకి దిగారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తానంటూ ఉత్తరప్రదేశ్‌కు వచ్చారు. కానీ, పోలీసులు ఆమెను మధ్యలోనే అడ్డుకున్నారు. నిషేధాజ్ఞలు ఉన్నాయంటూ ప్రియాంకతో పాటు ఆమె అనుచరులను నిర్బంధించారు. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రియాంక ధర్నా చేపట్టారు. బాధితులను ఎందుకు కలవనివ్వరని బలంగా ప్రశ్నించారు. ఐనప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గలేదు. పైగా, ప్రియాంక సహా కాంగ్రెస్ నేతలను చునార్ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. దాంతో ప్రియాంక తీవ్రంగా స్పందించారు. బాధితులను కలిసేంతవరకు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్న ఆమె, శుక్రవారం రాత్రి ఉండిపోయారు. కరెంట్, నీటి సరఫరా సరిగా లేకపోయినా పట్టించుకోలేదు.

మొత్తానికి ప్రియాంక అనుకున్నది సాధించారు. బాధితులను పరామర్శించే వరకు వెనక్కి వెళ్లబోనన్న ప్రియాంక, ఆ పని పూర్తి చేశారు. తమను కలవడానికి పోలీసులు ప్రియాంకను అనుమతించకపోవడంతో, బాధితుల కుటుంబసభ్యులే చునార్ గెస్ట్‌హౌస్‌కు వచ్చి ప్రియాంకమెను కలిశారు. ఈ సందర్భంగా పోలీసులు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ప్రియాంక తీవ్రంగా మండిపడ్డారు.

ఇదిలా ఉంటే, ప్రమోద్ తివారీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం గవర్నర్ రామ్‌నాయక్‌ను కలిసింది. సోన్‌భద్ర కాల్పుల ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. బాధితుల కన్నీళ్లను తుడవడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని, ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.

మరోవైపు, కాంగ్రెస్‌కు తోడుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది. ఐతే, టీఎంసీ నేతలను కూడా పోలీసులు అనుమతించలేదు. టీఎంసీ ప్రతినిధుల బృం దాన్ని వారణాసి విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. దాంతో టీఎంసీ నేతలు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాజ్‌వాదీ, బీఎస్పీ నేతలు కూడా సోన్‌భద్ర జిల్లా కాల్పులపై తీవ్రంగా స్పందించారు. యూపీ అసెంబ్లీ, పార్లమెంట్‌లోనూ ఈ అంశంపై రగడ చెలరేగింది.

విపక్షాల తీరుపై సీఎం యోగి ఆదిత్యానాధ్ భగ్గుమన్నారు. కాంగ్రెస్ నిర్వాకం వల్లే సోన్‌భద్ర జిల్లాలో ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. ఉబ్బా గ్రామంలో ఏర్పడిన ఈ వివాదం, 1955 నాటిదని యోగి పేర్కొన్నారు. నాడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందని, ఆదర్శ్ సొసైటీ పేరుతో ఆ భూమిని కాజేయడానికి అప్పుడే ప్రయత్నాలు జరిగాయ ని యోగి తెలిపారు. 1989లో మరోసారి అదే ప్రయత్నం జరిగిందని, అప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉందని గుర్తు చేశారు. అప్పుడే సమస్యను సరిగా పరిష్కరించి ఉంటే ఇప్పుడీ దారుణం జరిగి ఉండేది కాదన్నారు.

మొత్తానికి సోన్‌భద్ర కాల్పుల ఘటన యూపీ రాజకీయాలను కుదిపేసింది. బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో కానీ, ఆ దారుణం చుట్టూ చేరి రాజకీయ నేతలు పబ్బం గడుపుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story