40 ఏళ్ల తర్వాత దర్శనమిచ్చిన స్వామి.. జనాన్ని వీడి జలంలోకి..

40 ఏళ్ల తర్వాత దర్శనమిచ్చిన స్వామి.. జనాన్ని వీడి జలంలోకి..

తమిళనాడు కంచిలోనీ వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో.. అత్తివరద రాజస్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సాక్షాత్తూ ఆ విష్ణుదేవుని స్వరూపమని నమ్మే.. ఈ స్వామి.. ఎప్పుడూ కొలనులోనే శయనిస్తారు. వేఘవతి నది ఒడ్డున కొలువుదీరిన కాంచీపురం క్షేత్రం విశ్వకర్మతో బ్రహ్మదేవుడే స్వామి విగ్రహాన్ని చెక్కించాడని ప్రతీతి. అయితే కేవలం 40 ఏళ్లకు ఓసారి మాత్రమే ఈ స్వామి.. భక్తులకు దర్శనం ఇవ్వడానికి బయటకు వస్తారు. అది కూడా కేవలం 48 రోజులు మాత్రమే. దివ్యమంగళ స్వరూపుడైన స్వామి.. జూలై 1న జలం వీడి జనంలోకి వచ్చారు. ఆగస్టు 17 వరకు భక్తులకు దర్శనమిచ్చారు.

ఆలయ కోనేటి గర్భంలో ఉండే తొమ్మిది అడుగుల అత్తి వరదరాజస్వామివారిని బయటకు తీసుకొచ్చి పవళింపు సేవతో వేడుకలను ప్రారంభించారు. ఈ అనంతపద్మనాభుని దర్శనం.. సర్వపాపహరణం అని భక్తుల నమ్మకం. వేఘవతి నది ఒడ్డున కొలువుదీరిన కాంచీపురం క్షేత్రంలో అడుగుపెట్టడమే పూర్వజన్మ సుకృతంగా చెబుతారు. సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవుడే.. అత్తి వరదరాజస్వామి విగ్రహాన్ని చెక్కించారని.. దీనికి దేవశిల్పి అయిన విశ్వకర్మ సాయపడ్డారని పురాణ కథనాలు చెబుతున్నాయి.

ఈ అపురూపమైన దృశ్యాన్ని చూసేందుకు దేశం నలుమూల నుంచి భక్తులు కంచికి క్యూ కట్టారు. దాదాపు కోటిమంది స్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని ఉంటారని అంచనా. గత 40 ఏళ్లుగా వేయి కళ్లతో ఎదురుచూసిన వారి నిరీక్షణ ఫలించింది. స్వామివారి దర్శనం దక్కింది. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, సెలబ్రెటీలు అందరూ పోటీ పడి మరీ స్వామివారి సేవలో తరించారు. సూపర్ స్టార్ రజనీకాంత్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 40 ఏళ్లకు ఒకసారి మాత్రమే భక్తుల్ని దర్శనమిచ్చే స్వామి.. జనాన్ని వీడి తిరిగి జలంలోకి వెళ్లారు. మొత్తం 48 రోజుల పాటు దర్శమిచ్చిన స్వామి మళ్లీ 2059లో భక్తులతో పూజలందుకోనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story