చిరంజీవి ఇచ్చిన 'ఐడియా'తో ఆ చిత్రం సూపర్ హిట్..

చిరంజీవి ఇచ్చిన ఐడియాతో ఆ చిత్రం సూపర్ హిట్..

కొన్ని కథలు కంచికి చేరితే.. కొన్ని కథలు మాత్రం తరాలు గుర్తు పెట్టుకునేలా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచి పోతాయి. అతిలోక సుందరి అనగానే అరక్షణమైనా తడుముకోకుండా గుర్తొచ్చే అందమైన రూపం శ్రీదేవి. ఆమెని చూసే సినిమాకు ఆ టైటిల్ సెట్ చేశారేమో దర్శకుడు రాఘవేంద్రరావు అన్నంత అందం శ్రీదేవి సొంతం. తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పటికి మరిచిపోలేని ఆణిముత్యం 'జగదేక వీరుడు అతిలోక సుందరి'... మెగాస్టార్ చిరంజీవి జగదేకవీరుడిగా.. దేవలోకం నుంచి దిగి వచ్చిన దేవకన్యగా శ్రీదేవి అద్భుత నటనను ప్రదర్శించి ఆ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేశారు.

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బుల్ బుల్ పిట్టా.. ఈ లైన్ ఈ చిత్రానికి సరిపోదేమో. మరి ముందు అనుకున్న లైన్ ప్రకారం సినిమా హిట్టయ్యేదో లేదో తెలియదు కానీ.. ఈ లైనే 100% కరెక్ట్ అనుకునేలా ఉంటుంది సినిమా. ఎందుకంటే ఈ చిత్రం లైన్ ముందు వేరేగా చెప్పారు రచయిత చక్రవర్తి. ఆయన చెప్పిన కథ ప్రకారం.. గాయాలైన చిన్నారికి వైద్యం చేయించాలంటే లక్షలు ఖర్చవుతాయి. అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. చంద్రుడిపైకి వెళ్లి వచ్చిన వారికి లక్షల్లో డబ్బు ఇస్తామంటూ ప్రకటన ఒకటి ఇస్తుంది. అది చూసిన మన హీరో చిరంజీవి స్పేస్‌షిప్‌లోకి వెళ్తాడు. అక్కడ విహారానికి వచ్చిన శ్రీదేవి ఉంగరం పోగొట్టుకుంటుంది. అది చిరంజీవికి దొరకడంతో దాన్ని వెదుక్కుంటూ శ్రీదేవి భూమ్మీదకు వస్తుంది. ఇది కథ. అయితే ఇది విన్న రాఘవేంద్రరావుగారు పెదవి విరిచారు. ఆయనకు నచ్చలేదు. స్పేస్‌షిప్, చంద్ర మండలం ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్‌గా ఉందన్నారు. హాయిగా సాగిపోయే అందమైన కావ్యంలాంటి కథ కావాలన్నారు దర్శకుడు రాఘవేంద్రరావు.

మంచి లైన్ కోసం కసరత్తు ప్రారంభించారు. చిత్ర బృందమంతా కూర్చుని చర్చలు జరుపుతోంది. ఇంతలో చిరంజీవికి వచ్చిన ఐడియా సినిమా రూపు రేఖల్నే మార్చేసింది. 'మానస సరోవరం' అయితే ఎలా ఉంటుంది అని తన బుర్రలో వచ్చిన ఓ మెరుపులాంటి ఆలోచనను రాఘవేంద్రరావుగారి చెవిన వేశారు మెగాస్టార్. అంతే కథ మొత్తం మారిపోయింది. రాఘవేంద్రరావుగారికి తెగ నచ్చేయడంతో వెంటనే ఓకే చేశారు. పాప గాయాలకు మానస సరోవరంలో దొరికే మూలికలతో నయమవుతుందన్న వైద్యుల సలహా మేరకు చిరంజీవి అక్కడికి వెళతారు. అక్కడ చిరంజీవికి ఉంగరం దొరకడం.. దానికోసం శ్రీదేవి భూలోకానికి వచ్చి మానవా.. మానవా అంటూ చిరంజీవి వెంట పడడం.. మనం చూసిన మరిచిపోలేని ఓ అద్భుత దృశ్యకావ్యం జగదేకవీరుడు.. అతిలోక సుందరి.

Tags

Read MoreRead Less
Next Story