ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్న ఆలయాలు

చంద్రగ్రహణం సందర్భంగా మూతబడ్డ ఆలయాలన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం విడిచాక ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పూజాధికాల అనంతరం భక్తుల్ని దైవ దర్శనానికి అనుమతిస్తారు.. చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం పది గంటలపాటు మూతబడింది.. గ్రహణం విడిచిన అనంతరం తెల్లవారుజామున ఐదు గంటలకు మళ్లీ శ్రీవారి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. అర్చకులు సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టారు.. అర్చన, సేవల అనంతరం ఉదయం పదకొండు గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ గ్రహణం ఎఫెక్ట్‌తో మూతబడ్డాయి.. భద్రాద్రి, చిలుకూరు బాలాజీ, బాసర, తిరుచూనారు, కాణిపాకం క్షేత్రాల్లో సంప్రోక్షణ చేపడుతున్నారు.. తెల్లవారుజామునే భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయాన్ని శుద్ధి చేసిన అర్చకులు.. ఉదయం ఐదు గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఉదయం 8 గంటలకు సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ తర్వాత భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు. యాదాద్రి ఆలయ ద్వారాలు ఉదయం 9 గంటలకు తెరుచుకోనున్నాయి.

చంద్రగహణం కారణంగా దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ కొన్ని గంటలపాటు మూతపడ్డా… దక్షిణ కైలాసంగా పేరున్న శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం గ్రహణ గండాలకు అతీతంగా నిలిచింది. గ్రహణం ఏ సమయంలో వచ్చినా.. ఇక్కడి ఆలయాన్ని తెరచి గ్రహణ కాలాభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే తరహాలో రాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజామున 4.30 గంటల వరకు ఆలయాన్ని తెరిచే ఉంచారు. చంద్రగహణం సమయంలో స్వామి, అమ్మవార్లకు గ్రహణ కాలాభిషేకాలు నిర్వహించారు. భక్తులకు స్వామి దర్శనం కల్పించారు.

మరోవైపు చంద్రగ్రహణం సమయంలో కూడా మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి ఆలయంలో పూజలు యధావిధిగా జరిగాయి. గ్రహణ సమయంలో ఆలయాన్ని తెరిచే ఉంచడం ఇక్కడి ప్రత్యేకత. గురుపౌర్ణమి సందర్భంగా మఠం పీఠాధిపతులు తులసివనంలో మృత్తికకు ప్రత్యేక పూజలు చేశారు. రాఘవేంద్రస్వామి జీవసమాధి అయ్యారు కాబట్టి.. గ్రహణం సమయంలోనూ పూజలు నిర్వహిస్తారని అర్చకులు చెప్పారు. గ్రహణం సమయంలో స్వామిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందన్న నమ్మకంతో ఆలయానికి భక్తులు క్యూ కట్టారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *