బడ్జెట్‌ ముందు హల్వా వేడుక

బడ్జెట్‌ ముందు హల్వా వేడుక

కేంద్ర బడ్జెట్‌ ప్రింటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సంప్రదాయంగా వస్తున్న హల్వా తయారీతో ఈకార్యక్రమానికి ఆర్థికశాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ శ్రీకారం చుట్టారు. అత్యంత గోప్యంగా, కట్టుదిట్టమైన నిఘా మధ్య లెక్కల పద్దులు ప్రింట్‌ అవుతాయి.. అటు మోదీ కేబినెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రిగా మొదటి సారి బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ వచ్చేనెల 5న పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం బడ్జెట్‌ హల్వా తయారీతో ప్రింటింగ్‌ ప్రక్రియను మొదలు పెట్టారు.

కేంద్ర బడ్జెట్‌ పత్రాల ముద్రణా కార్యక్రమం మొదలైంది.. బడ్జెట్‌ పత్రాల ముద్రణకు సన్నాహకంగా చేసే సంప్రదాయ హల్వా వేడుక నార్త్‌బ్లాక్‌లో ఆర్థిక శాఖ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నిర్మలా సీతారామన్‌, సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హాజరయ్యారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌, ముఖ్య అధికారులు, కార్యాలయ సిబ్బంది బడ్జెట్‌ హల్వా రుచి చూశారు. అనంతరం బడ్జెట్‌ పత్రాల ముద్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు.

. జులై 5 న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ ప్రతుల ముద్రణ.. హల్వా తయారీతో లాంఛనంగా ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ హల్వాను పెద్ద కడాయిలో తయారు చేసి బడ్జెట్ రూప కల్పనలో పాల్గొనే అధికారులందరికీ పంచిపెడతారు. ఎప్పుడైతే హల్వా వండటం ప్రారంభమౌతుందో ఇక అప్పటి నుంచి బడ్జెట్ ప్రింటింగ్‌ ప్రారంభమైనట్లు లెక్క.

బడ్జెట్‌ ప్రతుల ముద్రణ ప్రారంభమైన నాటి నుంచి.. సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే వరకు తయారీలో పాల్గొనే అధికారులపై చాలా గట్టిగానే ఆంక్షలు ఉంటాయి. ఆర్థిక శాఖలోని అధికారులు, సిబ్బంది బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతారు. బడ్జెట్‌లోని అంశాలు బయటకు పొక్కకుండా ఉండేందుకే ఈ చర్యలు చేపడతారు. బడ్జెట్‌ కాపీల ముద్రణ విషయంలోనూ గట్టి నిఘా ఉంటుంది. పటిష్టమైన సైనిక భద్రతతో పాటు అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లులను ఏర్పాటు చేస్తారు. ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకూ ఈ భద్రత కొనసాగుతుంది.ఇక బడ్జెట్‌రోజున ప్రతుల్ని భారీ బందోబస్తు మధ్య పార్లమెంటు భవనానికి తరలిస్తారు. అనంతరం ఆర్థికమంత్రి సార్వత్రిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు.

Tags

Read MoreRead Less
Next Story