చంద్రయాన్‌-2 కౌంటన్‌ డౌన్‌ ఇవాళే ప్రారంభం..

చంద్రయాన్‌-2 కౌంటన్‌ డౌన్‌ ఇవాళే ప్రారంభం..

భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-2 కౌంటన్‌ డౌన్‌ రెండోసారి నేటి సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు ప్రారంభంకానుంది. నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రంలో GSLV MARK 3M1 వాహకనౌక ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంట్‌డౌన్‌ 20 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్‌లోని కల్పన అతిథిగృహంలో రాకెట్‌ సన్నద్ధతపై శాస్త్రవేత్తలు సమావేశమై చర్చించారు. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ ప్రయోగ పనులపై అన్ని సెంటర్ల డైరెక్టర్లతో మాట్లాడారు.

క్రయోజనిక్‌ దశలో వచ్చిన సాంకేతిక లోపంతో ఈ నెల 15న ప్రయోగానికి 56 నిమిషాల ముందు చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని వాయిదా వేశారు. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి వారం తిరగక ముందే ఆ లోపాన్ని అధిగమించారు. దీనికి సంబంధించి తీసుకున్న నివారణ చర్యలపైనా శాస్త్రవేత్తలు చర్చించారు. ఆ తర్వాత లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశం జరిగింది. ల్యాబ్‌ చైర్మన్‌ రాజరాజన్‌ వాహక నౌక ప్రయోగానికి అనుమతిచ్చారు. GSLV MARK 3M1 వాహకనౌక 3.8 టన్నుల బరువుగల చంద్రయాన్‌-2 ఉపగ్రాహాన్ని రోదసిలోకి మోసకెళ్లనుంది.

చంద్రయాన్‌-2 ప్రయోగంపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వారం క్రితం క్రయోజనిక్‌ దశలో లోపంతో ప్రయోగం నిలిపేయడంతో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌంట్‌డౌన్ పూర్తై నింగిలోకి దూసుకెళ్లిన తర్వాత GSLV-3M1 రాకెట్ కాంపోజిట్‌ మాడ్యూల్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. అనంతరం దాని కక్ష్యను శాస్త్రజ్ఞులు దశలవారీగా 16 రోజుల పాటు పెంచుకుంటూ పోతారు. తర్వాత 5 రోజులకు అది చంద్రుడి కక్ష్యలోకి చేరుతుంది. అక్కడ 27 రోజులపాటు చంద్రుడి చుట్టూ తిరుగుతుంది.

ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌..... మూన్‌ దిశగా పయనించి జాబిలి దక్షిణ ధ్రువంపై ల్యాండ్‌ అవుతుంది. దాదాపు 54 రోజుల పాటు నిర్విరామంగా 3 లక్షల 50 వేల కిలోమీటర్లు ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకోనుంది చంద్రయాన్‌-2 మిషన్. సెప్టెంబ‌ర్ రెండో వారంలో చంద్రయాన్‌-2 రోవ‌ర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండవుతుంది. మొత్తం ప్రయోగంలో ఇదే కఠినమైనది. ప్రాజెక్టు విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనాల సరసన మనదేశం సగర్వంగా నిలవనుంది.

చంద్రయాన్-2 ప్రాజెక్టు మొత్తం ఖర్చు 978 కోట్లు. ఇది పూర్తిగా మన దేశంలో అభివృద్ధి చేసిన ప్రాజెక్టు. నేవిగేషన్‌, గైడెన్స్‌ కోసం నాసా డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌కు చెల్లింపులు జరిపి మనదేశం ఉపయోగించుకుంది. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 13 రకాల పరికరాలను జాబిలిపైకి పంపిస్తున్నారు. వీటి సాయంతో చంద్రుని ఉపరితలం అధ్యయనం, అక్కడి ఖనిజ వనరులు, నీరు, ఇంధన నిల్వలను విశ్లే షిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story