నకిలీ నోట్లతో మీ సేవకు టోకరా.. ఎంచక్కా రూ.89 వేలతో..

నకిలీ నోట్లతో మీ సేవకు టోకరా.. ఎంచక్కా రూ.89 వేలతో..

మేడమ్.. విదేశీ కరెన్సీ మార్చాలి. కాస్త ఈ యూఏఈకి చెందిన 4800 దీర్హమ్స్ తీసుకుని ఇండియన్ కరెన్స్ ఇస్తారా అని ఎంతో నమ్మకంగా అడిగాడు ఏ మాత్రం అనుమానం రాకుండా. దాంతో ఆ కరెన్సీ నిజమే అనుకుని మోసపోయింది మీసేవ ఆపరేటర్. నిజామాబాద్ జిల్లా నవీపేటలోని మీసేవ కేంద్రానికి శనివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఇద్దరిలో ఒకడైన షకీల్ మీసేవ కేంద్రం లోపలికి వెళ్లాడు. రెండో వ్యక్తి బయటే బండిపైన కూర్చుని ఉన్నాడు. షకీల్ తీసుకు వచ్చిన దీర్హమ్స్ చూసిన ఆపరేటర్ వాటిని పరిశీలించి రూ.88,800లు వస్తాయని చెప్పారు. అందుకు సరేనంటూ ముందు ఒప్పుకున్నాడు. అనుమానం రాకుండే అక్కడే కొద్ది సేపు చక్కర్లు కొట్టాడు. ఆ తరువాత తక్కువ డబ్బు ఇస్తున్నారంటూ ఆపరేటర్‌తో కొద్ది సేపు వాగ్వాదానికి దిగి వెళ్లి పోయాడు. వెళ్లిన పదినిమిషాల్లో మళ్లీ వెనక్కి వచ్చి 88,800లకు ఇంకొక్క రూ.200 లు కలిపి రూ.89 వేలు ఇవ్వొచ్చుగా అంటే సరేనంటూ దీర్హమ్స్ తీసుకుని రూ.89 వేలు (ఇండియన్ కరెన్సీ) ఇచ్చేసింది ఆపరేటర్. డబ్బు తీసుకుని ఎంచక్కా చెక్కేసాడు అక్కడి నుంచి. అతడు వెళ్లి పోయాక చూసుకుంటే షకీల్ ఇచ్చింది నకిలీ దీర్హమ్స్ అని తెలుసుకున్నారు మీసేవ సిబ్బంది. వెంటనే మీసేవ యజమాని చందూకి సమాచారం అందించారు. ఆయన నవీపేట పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం వైరల్ కావడంతో జిల్లాలోని డిచ్‌పల్లి, కామారెడ్డి ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల్లోనూ ఇదే తరహాలో మోసపోయామని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story