'బిగ్‌బాస్‌'పై గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్‌పై గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు..

ప్రసారానికి ముందే బిగ్‌ బాస్‌-3 రియాలిటీ షో సంచలనంగా మారింది... షో చుట్టూ వివాదాల నీడలు కమ్ముకుంటున్నాయి.. సినీ నటి గాయత్రి గుప్తా ఫిర్యాదుతో రాయదుర్గం పీఎస్‌లో బిగ్‌బాస్ షోపై కేసు నమోదైంది..

బిగ్‌బాస్‌ సీజన్‌-3 ప్రారంభానికి ముందే వివాదాలకు కేరాఫ్ అవుతోంది. హౌస్‌మేట్స్ సెలక్షన్ విషయంలో బిగ్‌బాస్ టీమ్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే మీడియా ముందుకు వచ్చిన యాంకర్, జర్నలిస్ట్ శ్వేతారెడ్డి చేసిన హాట్‌ కామెంట్స్‌తో రచ్చ రచ్చ అవుతుంటే, తాజాగా రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.. బిగ్‌ బాస్‌ 3 నిర్వాహకులు తనకు అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేశారంటూ సినీ నటి గాయత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్వేతారెడ్డితో కలిసి రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన గాయత్రి గుప్తా పోలీసులకు కంప్లయింట్ చేశారు.

బిగ్‌బాస్‌ 3 నుంచి నిర్వాహకులు ఫోన్‌ చేసి నటించేందుకు సిద్ధమా అని అడిగారని.. ఆ తర్వాత ఆ టీమ్‌కు సంబంధించిన మరి కొంత మంది వ్యక్తులు తమ ఇంటికి వచ్చి అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నారని గాయత్రి చెప్పారు. ఈ మేరకు తాను సినిమాలు కూడా వదులుకున్నానని తెలిపారు. అయితే తనను అసభ్యకరమైన రీతిలో కమిట్‌మెంట్‌ అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేశానన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఫోన్‌ చేసి తనకు ఛాన్స్‌ రాలేదని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిగ్‌ బాస్‌ షోలో సెలక్ట్‌ అయ్యానని చెప్పడంతో.. ఆరు సినిమాల్లో ఛాన్స్‌లు వదులుకున్నానని.. తనకు జరిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ కూడా చేయలేదని గాయత్రి గుప్తా ఫిర్యాదులో పేర్కొన్నారు.

షోను రక్తి కట్టించేందుకు పాపులర్ పర్సనాలిటీలతో పాటు సోషల్ మీడియాలో పాపులర్ అయినవారికి కూడా బిగ్ బాస్ హౌజ్ లోకి అవకాశం కల్పిస్తారు. బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ తో కంటెస్టెంట్లకు మరింత పాపులారిటీ పెరిగే అవకాశాలు ఉంటాయి. దీంతో సాధారణంగానే హౌజ్ లోకి ఎంట్రీ దొరికితే జాక్ పాట్ తగిలినట్టే అని భావించే వారు కూడా ఉంటారు. ఈ క్రేజ్ నే బిగ్ బాస్ కో-ఆర్డినేటర్లు, ప్రొడ్యూసర్లు క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు ఇప్పటికే యాంకర్‌ శ్వేతారెడ్డి బిగ్‌ బాస్‌ నిర్వాహాకులపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్‌ ప్రోగ్రాం ఇన్‌ఛార్జ్‌లు తనను మోసం చేశారని శ్వేతా రెడ్డి ఆరోపించారు. తాజాగా గాయత్రి గుప్తా కూడా ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది.. దీనిపై పోరాటం కొనసాగుతుందని చెప్పారు గాయత్రి గుప్తా. మా అసోసియేషన్‌లోనూ ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తమకు జరిగిన అన్యాయం ఇండస్ట్రీలో మరెవరికీ జరగకూడదనే ఉద్దేశంతోనే కెరీర్‌ను ఫణంగా పెట్టి ముందుకొచ్చానని గాయత్రి చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story