తెలుగు రాష్ట్రాల రైతులకు శుభవార్త.. ఆ రెండునెలలు భారీవర్షాలు..

తెలుగు రాష్ట్రాల రైతులకు శుభవార్త.. ఆ రెండునెలలు భారీవర్షాలు..

నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో దిగాలుగా ఉన్న తెలుగు రాష్ట్రాల రైతులకు వాతావరణ నిపుణులు గుడ్‌ న్యూస్ చెప్పారు. ఆగస్ట్‌, సెప్టెంబర్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రపంచ వాతావరణంపై ప్రత్యేకించి మన దేశంలో రుతుపవనాల కదలికలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న ఎల్‌నినో క్రమంగా బలహీనపడుతోందని తాజా అధ్యయనంలో తేలింది. ఇది ఒకటి, రెండు నెలల్లో తటస్థ స్థితికి చేరుకుంటుందని, దీని ప్రభావంతో వచ్చే 2 నెలలలో భారీ వర్షాలు పడ్తాయంటున్నారు వాతావరణ నిపుణులు.

ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు బలహీనంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాల్లోను లోటు వర్షపాతం నెలకొంది. దీంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో దుర్బిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి ఎల్‌నినో ప్రభావమే కారణం. నైరుతి రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు తరలిపోవడమే కారణం. నైరుతి రుతుపవనాల ఆగమనం, విస్తరణకు అనేక సందర్భాల్లో అడ్డుగా నిలుస్తోంది ఎల్‌నినో. అదిప్పుడు బలహీన పడుతుండటంతో రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నా యని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా దక్షిణాదివైపు రావాల్సిన నైరుతి రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు వెళ్లిపోయింది. ఇది కూడా వర్షాలు పడకపోవడానికి కారణం. అయితే హిమాలయాల వైపు వెళ్లిన రుతుపవన ద్రోణి త్వరలో తిరిగి దక్షిణాది ప్రాంతంపైకి రానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో సాధారణం కంటే ఎక్కువగా వానలు పడ్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్‌నినో క్రమంగా బలహీన పడుతుండటంతో మున్ముందు మంచి వర్షాలు కురుస్తాయని అమెరికా శాస్త్రవేత్తలు కూడా విశ్లేషించారు. రుతుపవనాలపై దాని ప్రభావం పూర్తిగా తొలగిపోకున్నా క్రమంగా ఆ ప్రభావం తగ్గిపోతుందని అంటున్నారు. అయితే ఎల్‌నినో క్షీణించినా మంచి వర్షాలు పడుతాయని ఖచ్చితంగా చెప్పలేమని మరికొందరు నిపుణులు అంటున్నారు.

పసిఫిక్‌ మహాసముద్రంలో భూమధ్యరేఖ దగ్గర జల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 డిగ్రీలు అధికంగా ఉంటే దాన్ని ఎల్‌నినో అంటారు. అంతకంటే తక్కువగా ఉంటే లానినో అంటారు. ఎల్‌నినో ఉంటే వర్షాలు తక్కువగా కురుస్తాయని, లా నినా వల్ల వర్షాలు అధికంగా కురుస్తాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడే ఎల్‌నినో ప్రభావం ఆసియా దేశాలపై పడుతుంది. ఫలితంగా ఇక్కడి సముద్రపు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ ఏడాదీ ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీంతో నైరుతి రుతుపవనాలు బలహీనం అయ్యాయి. ఈసారి వర్షాకాలం ఆలస్యంగా ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఎల్‌నినో అని వాతావరణ నిపుణులు అంటున్నారు. దీంతో కీలకమైన జూన్‌ నెలలో లోటు వర్షపాతం నమోదై తెలుగు రాష్ట్రాల్లో సాగు పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. జూన్, జూలైలలో ఇప్పటివరకు సాధారణం కంటే లోటు వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలాలు అడుగంటి రెండు రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. అయితే ఒక్కోసారి ఎల్‌నినో, లా నినాలతో సంబంధం లేకుండానే మంచి వర్షాలు కురిసిన సందర్భాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం విశ్లేషించింది. అయితే లా నినో ఏర్పడిన ఎక్కువ సందర్బాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, కొన్ని సందర్భాల్లో అధికంగా కూడా వర్షాలు కురిసాయని తెలిపారు. ఎల్‌నినో బలంగా ఉంటే వర్షాలు కురవవని అనుకోవడానికి వీల్లేదని వాతావరణ శాఖ అధికారులంటున్నారు.

ఎల్‌నినోకు తోడు ఈసారి నైరుతి రుతుపవన ద్రోణి కూడా తెలుగు రాష్ట్రాలను ముంచింది. రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు వెళ్లిపోవడం ప్రస్తుత పరిస్థితికి మరో కారణంగా హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చెబుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక నైరుతి రుతుపవన ద్రోణి ఏర్పడుతుంది. ఇది నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించే సమయంలో రాజస్తాన్‌లోని గంగానగర్‌ నుంచి అలహాబాద్‌ మీదుగా ఉత్తర బంగాళాఖాతం వరకు ఏర్పడుతుంది. ఆ సమయంలో నైరుతి రుతుపవన ద్రోణి సాధారణ స్థితి నుంచి గాలుల దిశను బట్టి కిందనున్న దక్షిణం వైపునకు రావాల్సి ఉంటుంది. అప్పుడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు కురుస్తాయి. అయితే ఈసారి అలా కాకుండా అది సాధారణ స్థితి నుంచి పైకి అంటే ఉత్తరం వైపు నుంచి హిమాలయాలవైపు వెళ్లి పోయింది.

Tags

Read MoreRead Less
Next Story