స్వర్ణాల పాంచ్ పటాకా మోగించిన గోల్డెన్ గర్ల్

స్వర్ణాల పాంచ్ పటాకా మోగించిన గోల్డెన్ గర్ల్

హిమాదాస్‌..! ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు! అంతా క్రికెట్ పిచ్చిలో ఉంటే ఈ గోల్డెన్ గర్ల్ మాత్రం దేశానికి పసిడి పంట పండిస్తోంది. జస్ట్ 18 రోజుల వ్యవధిలోనే ఏకంగా 5 స్వర్ణాలు గెలిచింది ఈ చిరుత. 19 ఏళ్ల అసోం రన్నర్‌ అంతర్జాతీయ స్థాయిలో వరుస పసిడి పతకాలతో భారత్‌ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేసింది. మరో పీటీ ఉషగా మన్ననలు అందుకుంటోంది.

గత ఏడాది ఫిన్లాండ్‌లో జరిగిన అండర్‌-19 ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్ ద్వారా హిమాదాస్‌ వెలుగులోకి వచ్చింది. ఆ మీట్‌లో 400 మీటర్ల పరుగును కేవలం 51. 46 సెకన్ల టైమింగ్‌తో పూర్తి చేసి వరల్డ్ చాంపియన్‌గా ఆవిర్భవించింది. ఇంటర్నేషనల్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత స్ర్పింటర్‌గా రికార్డు నెలకొల్పింది. తొలి అంతర్జాతీయ టోర్నీలో ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఎంతో తెలివిగా పరుగెత్తి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది హిమాదాస్. సరిగ్గా ఏడాది తిరిగే సరికల్లా స్వర్ణాల పాంచ్ పటాకా మోగించిందీ గోల్డెన్ గర్ల్.

అసోంలోని నగావ్‌ జిల్లా ధింగ్‌ గ్రామానికి చెందిన హిమాదాస్ ది పేద వ్యవసాయ కుటుంబం. రన్నర్‌గా తొలి అడుగులు తన పొలంలోనే వేసింది. స్కూల్‌ స్థాయులో ఫుట్‌బాల్‌ ఆడిన ఆమె.. కోచ్‌ సలహా మేరకు ట్రాక్‌ ఫీల్డ్‌లోకి అడుగు పెట్టింది. 100, 200 మీటర్ల పరుగులో మెరుపులు మెరిపించింది. అయితే 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల 400 మీటర్ల పరుగులో కొద్ది తేడాలో పతకం గెలిచే ఛాన్స్ మిస్సైంది. ఆ తర్వాత అండర్‌-20 వరల్డ్‌ చాంపియన్‌షిప్స్ లో సత్తా చాటింది.. 400 మీటర్లలో స్వర్ణం చేజిక్కించుకోవడంతో హిమాదాస్‌ పేరు ఒక్కసారిగా మార్మోగింది. అప్పటి నుంచి అసోం ప్రజలు ఆమెను ముద్దుగా "ధింగ్‌ ఎక్స్ ప్రెస్ " అని పిలుస్తున్నారు..

గత ఏప్రిల్‌లో దోహాలో జరిగిన ఏషియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్ నుంచి వెన్నునొప్పి కారమంగా మధ్యలోనే వైదొలగింది హిమాదాస్. ఆ తర్వాత కోలుకున్న ఆమె ప్రస్తుతం యూరప్‌లో పాల్గొంటున్న అంతర్జాతీయ టోర్నీల్లో పసిడి పతకాలతో హోరెత్తిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story