ఫలించిన పోరాటం.. యోగా ట్రైనర్‌కు రూ.8 లక్షల నష్టపరిహారం..

ఫలించిన పోరాటం.. యోగా ట్రైనర్‌కు రూ.8 లక్షల నష్టపరిహారం..

ఆపరేషన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా పేషెంట్‌ని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కారణంగా బాధితుడికి నష్టపరిహారంగా రూ.8 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్త పల్లికి చెందిన దేవయ్య యోగా టీచర్. కొంతకాలంగా ఆయన పైల్స్‌తో బాధపడుతున్నారు. 2018 ఫిబ్రవరి 24న సికింద్రాబాద్‌లోని పైల్స్ క్లినిక్‌కి వెళ్లి లేజర్ ట్రీట్‌మెంట్ చేయించుకున్నారు. రూ.25వేలు బిల్లు కట్టించుకుని ఆపరేషన్ చేసిన రోజే దేవయ్యను డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లాక ఆయనకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఇబ్బంది పడ్డారు. దీంతో మళ్లీ ఆపరేషన్ చేసిన వైద్యుల్ని సంప్రదించారు దేవయ్య. డాక్టర్ పరీక్షించి మరో ఆసుపత్రికి వెళ్లమంటూ రిఫర్ చేశారు. అక్కడకు వెళితే చికిత్స కోసం పెద్ద మొత్తంలో బిల్లు అవుతుందని చెప్పారు. దీంతో దేవయ్య సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి పరిస్థితిని వివరించారు.

కేటీఆర్ స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5.50 లక్షలు మంజూరు చేయించారు. ఈ ప్రాసెస్ అంతా అయ్యే సరికి చికిత్స ఆలస్యం అయింది. దాదాపు నెలరోజుల పాటు చికిత్స చేసి రూ.18 లక్షల బిల్లు వేశారు ఆ హాస్పిటల్ డాక్టర్లు. బిల్లు కట్టేందుకు దేవయ్య తనకున్న కొద్ది పాటి భూమిని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో తన ఈ పరిస్థితికి కారణమైన సికింద్రాబాద్ పైల్స్ క్లినిక్ డాక్టర్‌పై వినియోగ దారుల ఫోరంలో కేసు వేశారు దేవయ్య. దీనిపై విచారించిన ఫోరం.. ఆసుపత్రి నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రూ.8 లక్షలు ఫైన్ వేసింది. 20 రోజుల్లో కేసును పరిష్కరించి దేవయ్యకు రూ.8 లక్షలు నష్టపరిహారాన్ని అందించాలని తెలిపింది. హాస్పిటల్ ఇచ్చిన ఆ చెక్కుని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ దేవయ్యకు అందజేశారు. యోగా ట్రైన‌ర్‌గా జాతీయ పోలీస్ అకాడమీలో పనిచేసి అంతర్జాతీయ స్థాయిలో కాంస్య పతకం సాధించారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా దేవయ్య ఉపాధిని కోల్పోయారు.

Tags

Read MoreRead Less
Next Story