భారత్‌, పాక్ పోరంటే ఇలాంటివి ఉంటేనే మజా..!

భారత్‌, పాక్ పోరంటే ఇలాంటివి ఉంటేనే మజా..!

ప్రపంచకప్‌లో అయినా, మరో సిరీస్‌ అయినా.. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఈ మ్యాచ్‌లో గెలుపును ఇరు జట్లూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. ఈ క్రమంలో ఆటగాళ్లు అదుపు తప్పి గొడవలకు దిగడం ఎన్నోసార్లు చూశాం. 1992 ప్రపంచకప్‌లో తాను బ్యాటింగ్‌ చేస్తున్నపుడు భారత వికెట్‌ కీపర్‌ కిరణ్‌ మోరె ఎక్కువగా అరుస్తుండటం, పదే పదే ఔట్‌ కోసం అప్పీల్‌ చేస్తుండటం పాకిస్థాన్‌ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌ జావెద్‌ మియాందాద్‌కు అసహనం తెప్పించింది. దీంతో ఒక బంతికి ముందు బౌలర్‌ను ఆపి మరీ మియాందాద్‌.. మోరెతో వాగ్వాదానికి దిగాడు. తర్వాత అతను మోరె ఎలా పైకి ఎగురుతూ అప్పీల్‌ చేస్తాడో తనే స్వయంగా గంతులేస్తూ చూపించాడు. మోరె ఏమీ స్పందించకుండా ఉండిపోయాడు. ఈ ద్యశ్యం ప్రపంచకప్‌లో ఆసక్తికర ఘటనల్లో ఒకటిగా నిలిచిపోయింది.

1996 ప్రపంచకప్‌లో భారత పేసర్‌ వెంకటేష్‌ ప్రసాద్‌, పాకిస్థాన్‌ ఓపెనర్‌ అమీర్‌ సోహైల్‌ మధ్య సాగిన పోరును ఇరు దేశాల క్రికెట్‌ అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. 288 టార్గెట్‌ను ఛేదించే క్రమంలో అమీర్ సొహైల్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత జట్టును టెన్షన్ పెట్టాడు. మంచి ఊపులో కనిపించిన సోహైల్‌.. ప్రసాద్‌ బంతికి ఫోర్‌ కొట్టి ‘వెళ్లి బంతి తెచ్చుకో’ అన్నట్లుగా సైగ చేశాడు. ప్రసాద్‌ ఏమీ మాట్లాడకుండా తర్వాతి బంతితో క్లీన్‌బౌల్డ్ చేసి రివేంజ్ తీర్చుకున్నాడు.

భారత ఓపెనర్‌ గంభీర్‌.. పాకిస్థాన్‌ ఆల్‌రౌండర్‌ అఫ్రిది ఒకటికి రెండుసార్లు మైదానంలో గొడవకు దిగారు. 2007లో కాన్పూర్‌లో వన్డే సందర్భంగా ఇద్దరి మధ్య చిన్నగా వాగ్వాదం మొదలైంది. తనను కవ్వించిన అఫ్రిదికి ఫోర్‌ కొట్టి సమాధానం చెప్పాడు గంభీర్‌. తర్వాత తాను పరుగు తీస్తుండగా అడ్డంగా నిలబడ్డ అఫ్రిదిని ఢీకొట్టి ముందుకెళ్లాడతను. దీంతో గొడవ ముదిరి ఒకరి మీదికి ఒకరు దూసుకెళ్లారు. తర్వాత ఆసియా కప్‌ సందర్భంగానూ ఓ మ్యాచ్‌లో వీళ్లిద్దరూ ఇదే తరహాలో గొడవకు దిగారు.

2012లో భారత్‌లో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో ఇషాంత్‌ శర్మ, కమ్రాన్‌ అక్మల్‌ ఇలాగే గొడవపడ్డారు. ఇదిలా ఉంటే 2003 ప్రపంచకప్‌లో తనను కవ్వించిన అక్తర్‌కు సచిన్‌ ఎలా బ్యాటుతో సమాధానం చెప్పాడో అభిమానులకు బాగానే గుర్తుంటుంది. 2010 ఆసియా కప్‌లో అక్తర్‌కు ,భజ్జీకి ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అయితే చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన భజ్జీ కసిగా ఆడాడు. అక్తర్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాదాడు. తర్వాత మరో బౌలర్‌ బంతిని సిక్సర్‌గా మలిచి భారత్‌కు విజయాన్నందించాడు. అక్తర్‌ను వెక్కిరిస్తూ సంబరాలు చేసుకున్నాడు

అయితే ప్రతీసారీ ఇరు జట్ల మధ్య గొడవలే కాదు స్నేహపూర్వక సంఘటనలు కూడా జరిగాయి. సచిన్‌ను అక్తర్ అభినందించడం , అభిమానులు కూడా కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్లీగానే ఉండడం కూడా మరిచిపోలేం. ఇదిలాఉంటే స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు ఐదేళ్లు నిషేధం ఎదుర్కొన్న మహ్మద్‌ ఆమిర్‌ విషయంలో విరాట్‌ కోహ్లి ఎంతో బాధ పడ్డాడు. అలాంటి ప్రతిభావంతుడు అలా దారి తప్పడం విరాట్‌ను బాధ పెట్టింది. అయితే నిషేధం పూర్తి చేసుకుని మళ్లీ జట్టులోకి వచ్చిన ఆమిర్‌కు విరాట్‌ బాసటగా నిలిచాడు. ఒక టోర్నీ సందర్భంగా కలిసినపుడు ప్రాక్టీస్‌ సందర్భంగా అతడిని పిలిచి తన బ్యాట్‌ అందించాడు. దీంతో ఆమిర్‌ ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. కాగా ఆయా సందర్భాల్లో పరిస్థితిని బట్టి వాగ్వాదాలు చోటు చేసుకుంటాయే తప్ప ఇరు జట్ల ఆటగాళ్ళూ గత కొంతకాలంగా స్నేహంగానే ఉంటున్నారు. అయినప్పటకీ... భారత్‌,పాక్ పోరంటే ఇలాంటి గొడవలు ఉంటేనే మజా ఉంటుందన్నది ఫ్యాన్స్ మాట.

Tags

Read MoreRead Less
Next Story