మూడు నెలలు 'జబర్థస్త్' షో నుంచి తొలగింపుపై.. శాంతి స్వరూప్

మూడు నెలలు జబర్థస్త్ షో నుంచి తొలగింపుపై.. శాంతి స్వరూప్

ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాద యాత్ర చేశారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు కొనసాగింది. ఈ పాదయాత్రలో ఆయనతో పాటు రాజకీయ నాయకులే కాకుండా వివిధ రంగాలకు చెందిన వారు కూడా పాల్గొని తమ మద్ధతు తెలియజేశారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు పాదయాత్రలో పాల్గొన్నారు. ఇక బుల్లితెర పాపులర్ షో జబర్ధస్త్ కామెడీ షో నుంచి శాంతి స్వరూప్, వినో‌ద్‌లు కూడా జగన్‌తో పాటు నడిచారు. పాదయాత్రలో పాల్గొనడంవల్ల షో నుంచి తొలగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని శాంతి స్వరూప్ ప్రస్తావిస్తూ.. పాదయాత్రకు వెళ్లడం వల్ల తమను షో నుంచి తొలగించలేదని స్పష్టం చేశారు.

మేం వెళుతున్న విషయం టీమ్ లీడర్లకు చెప్పాం కానీ వారు మా ప్లేస్‌లను వేరొకరితో భర్తీ చేయలేకపోయారు. సమయానికి వారికి ఎవరూ దొరకలేదు. దాంతో ఇంకొకరు ఇలా చేయకూడదని మాపై మూడు నెలలు నిషేధం విధించారు. మమ్మల్ని నమ్ముకుని స్కిట్లు రాసుకున్నప్పుడు, మేం అలా చేయకూడదు.. ఆ విషయం తెలియజెప్పడానికే అలా చేశారు అని శాంతి స్వరూప్ చెప్పుకొచ్చారు. ఆ మూడు నెలలు షో రన్ చేసే వారితో టచ్‌లోనే ఉన్నామని ఆయన అన్నారు. కానీ, ఇందుకు సంబంధించిన వార్తలు మాత్రం నెగటివ్‌గా వచ్చాయి. పాదయాత్రలో పాల్గొనడంవల్లే తమని తీసేశారని వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story