కల్కి మూవీ రివ్యూ

కల్కి మూవీ రివ్యూ

రివ్యూ : కల్కి

తారాగణం : రాజశేఖర్, అదాశర్మ, నందిత శ్వేత, రాహుల్ రామకృష్ణ, అశుతోష్ రాణా, శతృ, సిధ్ధూ జొన్నలగడ్డ

సంగీతం : శ్రవణ్ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర

నిర్మాత : సి కళ్యాణ్

బ్యానర్ : శివానీ శివాత్మిక

దర్శకత్వం : ప్రశాంత్ వర్మ

కెరీర్ క్లోజ్ అయిపోయింది అనుకున్న దశలో పిఎస్వీ గరుడవేగతో బౌన్స్ అయ్యాడు రాజశేఖర్. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో కెరీర్ పై కొత్త ఆశలు చిగురించాయి. ఈ క్రమంలో అ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి సినిమా అనౌన్స్ అయింది. టైటిల్ నుంచి టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచుకుంటూ పోయారు. మరి ఆ స్థాయిలో సినిమా ఉందా అనేది చూద్దాం..

కథ :

కొల్లాపూర్ అనే ఊరిలో జాతర జరుగుతుంది. ఆ జాతరలో ఊరంతా చాలా మంచివాడు అనుకునే శేఖర్ బాబు హత్యకు గురవుతాడు. అతన్ని చంపేసి జాతరలోనే దారుణంగా తగులబెడతారెవరో. ఆ కేస్ ను ఇన్విస్టిగేట్ చేయానికి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ కల్కి ఆ ఊరికి వస్తాడు. కానీ అతను కేవలం శేఖర్ బాబు హత్యనే కాకుండా ఆ ఊరి ఎమ్మెల్యే(అశుతోష్) ఇష్టం లేని కోణంలో దర్యాప్తు చేస్తుంటాడు. దీంతో కల్కిపై హత్యా ప్రయత్నాలూ చేస్తారు. ఈ కేస్ దర్యాప్తులో కల్కికి అనేక భయంకరమైన నిజాలు తెలుస్తాయి. మరి అవేంటీ..? అసలు శేఖర్ బాబును చంపింది ఎవరు..? ఎందుకు..? అనేది మిగతా కథ.

విశ్లేషణ :

కొన్ని కథలు పేపర్ పై అద్భుతంగా ఉంటాయి. కానీ ఆ అద్భుతం పూర్తిస్థాయిలో వెండితెరపై కనిపించదు. కల్కి కూడా అలాంటిదే. దీంతో ఎక్సల్లెంట్ అని చెప్పాల్సి సినిమా కాస్త సూపర్ అనేంత వరకూ వచ్చి ఆగింది. కథ ప్రారంభించడం చాలా బావుంది. స్టోరీని ఎలా స్టార్ట్ చేయాలో తెలియడం కూడా ఇంపార్టెంట్. అలా ఊరు.. ఊరిలోని వ్యక్తులు.. సమస్యలు, వాటిని సృష్టించేవాడు.. తీర్చేవాడు అంటూ రకరకాల పాత్రలు పరిచయం చేస్తూనే.. అంతా మంచి వాడు అనుకుంటోన్న వ్యక్తి సడెన్ గా మర్డర్ అవడం.. అతనెవరో తెలియకుండానే ఆసక్తి పెంచిన పాత్రను చంపేయడం ఆసక్తిని పెంచింది. అటుపై ఆ హత్య కేస్ ను ఇన్వెస్టిగేట్ చేస్తోన్న అధికారికి ఓ జర్నలిస్ట్ సాయం చేస్తూ ఉండంటంతో కథనం ముందుకు సాగుతుంది. మధ్యలో హీరో తాలూకూ ప్రేమకథ. అయితే ఇంటర్వెల్ వరకూ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. కల్కి ఇన్వెస్టిగేషన్ పెద్దగా థ్రిల్ అనిపించదు. అలాగని బోర్ కొట్టదు. కాకపోతే చాలా వరకూ ట్రిమ్ చేసి ఉంటే వేగం పెరిగేదే అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో ఈ ప్రాబ్లమ్ ఉండదు. దర్యాప్తు వేగంగా సాగుతూ.. ప్రతి ఇన్సిడెంట్ రివీల్ అవుతున్నప్పుడల్లా ప్రేక్షకులు సరికొత్త అనుభూతికి లోనవుతాడు. ఈ క్రమంలో వచ్చే చాలా సీన్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఇందుకోసం దర్శకుడు ఎంచుకున్న నేపథ్యం కూడా బాగా కలిసొస్తుంది. నల్లమల అడవిలో స్మగిలింగ్, కృష్ణానదిలో శ్రీశైలం వరకూ బోటింగ్ సీన్స్, కొల్లాపూర్ జలపాతం వద్ద సీన్స్ ఇవన్నీ సరికొత్త అనుభూతినిస్తాయి. మనిషి జీవితంలో చాలా విషయాలు యాధృఛ్ఛికం అనుకుంటారు కానీ.. అవన్నీ కర్మానుసారమే అని నాజర్ పాత్రతో చెప్పించి.. దానికి ఇచ్చిన ఫినిషింగ్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతూనే సూపర్బ్ అనిపిస్తాయి. కాకపోతే చాలాసార్లు కథనం కాస్త నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో అర్జున్ రెడ్డి ఫేమ్ రాహుల్ రామకృష్ణ నవ్వించే ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు హారర్ లా, మరికొన్నిసార్లు థ్రిల్లర్ లా.. ఇంకొన్నిసార్లు సస్పెన్స్ లా అనిపిస్తూ అన్ని ఫీలింగ్స్ నూ అందించడంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలో అతనికి ఆర్టిస్టులతో పాటు టెక్నికల్ టీమ్ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది.

నటులుగా రాజశేఖర్ కు ఇది టైలర్ మేడ్ రోల్. క్యాజువల్ గా చేసుకుంటూ పోయాడు. అదాశర్మ పాత్రకు పెద్ద ప్రియారిటీ లేదు. నందిత శ్వేత అప్పుడప్పుడూ మెరుస్తూ క్లైమాక్స్ లో అదరగొట్టింది. విలన్ గా అశుతోష్ రాణా ఆహార్యం బావున్నా.. ఆ పాత్రను ఇంకాస్త ఎలివేట్ చేయాల్సింది అనిపిస్తుంది. సిద్ధూ క్యారెక్టర్ చాలా బావుంది. అతనూ బాగా చేశాడు. నాజర్, రాహుల్, శతృ, చరణ్ దీప్, పూజిత పొన్నాడ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి టెక్నికల్ టీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. శ్రవణ్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ నెక్ట్స్ లెవెల్ లో ఉందని చెప్పాలి. ఆర్ఆర్ తో అతను సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచాడు. అలాగే దాశరథి సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎడిటింగ్ పరంగా అరగంట వరకూ కట్ చేసినా ఇబ్బందేం ఉండదు. ముఖ్యంగా కథలోని సబ్ ప్లాట్స్ గా ఉన్న లవ్ స్టోరీ వంటివి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. 1980ల కాలం నాటి వాతావరణం ప్రతిబింబించడంలో సక్సెస్ అయ్యారు. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ తను రాసుకున్న కథను కథనంగా మలచడంలో సక్సెస్ అయినా దాన్ని వేగంగా నడపడంలో కాస్త తడబడ్డాడు. అయినప్పటికీ కల్కి ఎంగేజ్ చేస్తుంది.

ప్లస్ పాయింట్స్: రాజశేఖర్, సెకండ్ హాఫ్, రాహుల్ రామకృష్ణ, సినిమాటోగ్రఫీ, సంగీతం, క్లైమాక్స్ ట్విస్ట్స్

మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్, స్లో నెరేషన్, కొన్ని బిల్డప్స్

Tags

Read MoreRead Less
Next Story