వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్లు ఇచ్చిన సిద్ధరామయ్య

వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్లు ఇచ్చిన సిద్ధరామయ్య

కర్నాటక అసెంబ్లీలో బలాబలాలు రోజురోజుకు మారిపోతున్నాయి. సభలో మొత్త 224 సీట్లు ఉన్నాయి. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ సొంత బలం 105. ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే, మరో స్వతంత్ర సభ్యుడు ఆ పార్టీకి మద్దతిచ్చారు. ఈ లెక్కన కమలం బలం 107కు చేరింది.

ఇక అధికార కూటమి విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో హస్తం గుర్తుపై 79 మంది గెలిచారు. వారిలో 13 మంది రాజీనామా చేశారు. ఆ రాజీనామాలు ఆమోదం పొందితే కాంగ్రెస్‌ నికరబలం 66కు పడిపోతుంది. ఇటు జేడీఎస్‌ నుంచి గత ఎన్నికల్లో 37 మంది గెలవగా.. ముగ్గురు రిజైన్‌ చేశారు. అంటే.. ఆ పార్టీ నికరబలం 34కు చేరింది. మరో ఎమ్మెల్యే మద్దతు ఉంది కాబట్టి.. సంకీర్ణం నికరబలం 101 మాత్రమే అవుతుంది.

16 రాజీనామాలను ఆమోదిస్తే.. అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 208కి చేరుతుంది. మేజిక్‌ ఫిగర్‌ 105 అవుతుంది. కాంగ్రెస్-జేడీఎస్ బలం 101కి పరిమితం కాగా.. బీజేపీ 107 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. ఆ పరిస్థితి రాకుండా చూసేందుకు కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్లు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే నలుగురిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్లు ఇచ్చారు సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య. ఓవైపు తమ రాజీనామాల ఆమోదానికి ఆ 10 మంది రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరుకు బయల్దేరుతున్న సమయంలోనే.. అనర్హత పిటిషన్లతో స్వాగతం పలికారు సిద్ధు.

మరి, కర్నాటక స్పీకర్ ఏం చేయబోతున్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్టు ఇవాళ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి ఆయన విచక్షణాధికారాల్ని, నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించలేరు. అలాగని.. సర్వోన్నత న్యాయస్థానం సూచనలను పాటించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా సభాపతి రమేష్‌ కుమార్ ఏం చేస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది. ముందుగా ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు కాబట్టి.. వాటిని ఆమోదిస్తారా..? అనర్హత పిటిషన్లను కలిపి విచారణ చేస్తారా.. అన్నది ఉత్కంఠ రేపుతోంది. అదే సమయంలో మిగతా ఆరుగురి విషయంలో ఆయన వైఖరి ఎలా ఉండబోతోందన్నది కూడా ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

Tags

Read MoreRead Less
Next Story