'పీరియడ్స్' సరిగా రావట్లేదా.. పట్టించుకోపోతే ఎలా..

పీరియడ్స్ సరిగా రావట్లేదా.. పట్టించుకోపోతే ఎలా..

ఎప్పుడూ రెగ్యులర్‌గా వస్తూ ఒక్కొక్కసారి లేటయితే అంతగా పట్టించుకోనవసరం లేదని డాక్టర్లు చెబుతుంటారు. కానీ అదే కంటిన్యూ అయితే మాత్రం ఆలోచించాలి. అలా కాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెలసరి ముందు వచ్చినా ఆలస్యంగా వచ్చినా ఇబ్బందే.. ఈ విషయాన్ని ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. మరి అవి ఎలా వస్తాయో ఓ సారి చూద్దాం.

సాధారణంగా 28 నుంచి 30 రోజులకు ఒకసారి నెలసరి వస్తుంది. నెలసరిని హార్మోన్లు నియంత్రిస్తాయి. మెదడులోని హైపోథాలమస్ పిట్యూటరీ గ్రంథిని ప్రభావితం చేస్తుంది. ఇది అండాశయాలపై ప్రభావం చూపిస్తుంది. థైరాయిడ్, ఎడ్రినల్ గ్రంథి నుంచి తయారయ్యే హార్మోన్లు కూడా నెలసరి రావడానికి దోహదపడతాయి. హార్మోన్ల పనితీరు మెరుగ్గా లేకపోతే కూడా నెలసరి సక్రమంగా రాదు. మరి కొన్ని సార్లు జన్యుపరమైన కారణాలు ఉండొచ్చు. వ్యాధినిరోధక వ్యవస్థ లోపాల వల్ల కూడా ఈ సమస్య ఎదురుకావొచ్చు.

సహజంగా ఆడపిల్లలకు పది, పదహారు సంవత్సరాల మధ్య నెలసరి మొదలవుతుంది. మెనోపాజ్ వచ్చేవరకు అది కొనసాగుతుంది. అయితే రుతుక్రమం మొదలైన కొత్తల్లో కాస్త అటు ఇటుగా నెలసరి వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో అంటే ఆమెకు డెలివరీ అయ్యాక, బిడ్డకు పాలిచ్చే క్రమంలో, గర్భనిరోధక మాత్రలు వాడి మానేసినప్పుడు, హార్మోన్ల సమస్య ఉన్నప్పుడు, కాపర్‌టీ వేయించుకున్నప్పుడు ఇలాంటి సమస్య తలెత్తుతుంది. మరికొన్ని సమస్యలు..

బరువు తగ్గినా, పెరిగినా నెలసరి ఆలస్యం అవుతుంది. చదువుల స్ట్రెస్, కుటుంబ పరిస్థితులు, మానసిక ఒత్తిడి, సరైన పోషకారం తీసుకోకపోవడం, డైటింగ్ పేరుతో తిండి తగ్గించినా, ఎక్సర్‌సైజులు ఎక్కువ చేసినా నెలసరి సక్రమంగా రాదు. ఆటో ఇమ్యూన్ సమస్య ఉన్నట్లైతే నెలసరి త్వరగా ఆగిపోయి మెనోపాజ్ ‌వస్తుంది.

క్రమం తప్పకుండా నెలసరి రావాలంటే.. సరిపడా ఆహారం తీసుకోవాలి. అందులో పండ్లు, మాంసకృత్తులు, ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. తగినంత వ్యాయామం చేయాలి. సమస్యను పెద్దది చేసుకుని ఇబ్బంది పడేబదులు.. రాకుండానే చూసుకోవాలి. ఒకవేళ హార్మోన్ల పనితీరు మెరుగ్గాలేకపోతే డాక్టర్ పర్యవేక్షణలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లు హెచ్‌ఆర్టీ రూపంలో తీసుకోవాలి. దీనివల్ల నెలసరి సక్రమంగా రావడంతో పాటు ఎముకలు, గుండె పనితీరు సవ్యంగా ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story