అంతుచిక్కని డీఎస్ వ్యూహం

అంతుచిక్కని డీఎస్ వ్యూహం

చేతి నీడ నుంచి బయటపడి.. అయిష్టంగా కారు ప్రయాణం చేస్తున్న శీనన్నకు సరైన వేదిక దొరికిందా.? తన స్థాయికి తగిన గుర్తింపు, ప్రాధాన్యం దొరుకుతున్నాయా? మరోవైపు.. డీఎస్‌ తమతో టచ్‌లో ఉన్నారని దత్తన్న చెప్పడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

తెలంగాణలో బలోపేతంపై బీజేపీ సీరియస్‌గా దృష్టి పెట్టింది. కానీ కమలానికి రాష్ట్రస్థాయి నాయకుల కొరత. ఆ లోటు శీనన్నతో భర్తీ చేస్తున్నారా? ఆపరేషన్ కమల్‌ వెనుక డి.శ్రీనివాస్‌ ఉన్నారని ఆయన సన్నిహితుల మాట. టీఆర్‌ఎస్‌తో విసిగిపోయిన డీఎస్.. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ.. రాష్ట్రంలో ఆ పార్టీ పరపతి క్రమంగా తగ్గిపోతోంది. అదే సమయంలో అర్వింద్‌ బీజేపీలో చేరడం.. ఎంపీగా గెలవడం చకచకా జరిగిపోయాయి. ఆ పార్టీ నాయకత్వం శీనన్న వ్యూహ చతురతకు ఫిదా అయినట్టు చెప్తున్నారు. ఉభయ కుశలోపరిగా బీజేపీలోకి ఆహ్వానించినట్టు టాక్. డీఎస్‌ చేరికపై కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ స్పష్టత ఇచ్చారు. ఆయనతో పాటు చాలామంది తమతో టచ్‌లో ఉన్నారని దత్తన్న చెప్పారు.

డీఎస్ నిజామాబాద్‌ జిల్లాకు చెందినవారే అయినా.. రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు ఉన్నారు. పలువురు సిట్టింగ్‌, మాజీ ప్రజా ప్రతినిధులతో మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా.. బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గం అండదండలు పుష్కలం. డీఎస్‌ బీజేపీలో చేరి.. ఆహ్వానిస్తే.. కాషాయ కండువా కప్పుకునేందుకు వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు సిద్ధంగా ఉన్నట్టు మరో ప్రచారం జరుగుతోంది. శీనన్న మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు డీఎస్.. పార్లమెంట్‌ హాల్‌లో సోనియాతో, రాహుల్‌గాంధీతో భేటీ అయినప్పుడు.. ఇక, కాంగ్రెస్‌లోకి వెళ్లబోతున్నారని అప్పుడు ప్రచారం జరిగింది. ఇప్పుడు అమిత్‌షాతో భేటీ అయ్యాక.. బీజేపీలో చేరబోతారని టాక్. నాడు నేడు మౌనమే శీనన్న సమాధానం.డీఎస్ తనకు తాను పార్టీ వీడతారని టీఆర్ఎస్ ఎదురుచూస్తుండగా.. తన రాజ్యసభ సభ్యత్వానికి ఇబ్బంది రాకుండా శీనన్న వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మధ్యలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ సాగుతుండడం ఆసక్తి రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story