గవర్నర్‌ నరసింహన్‌ ను మరో విడతలో మారుస్తారా.. కొనసాగిస్తారా..!

గవర్నర్‌ నరసింహన్‌ ను మరో విడతలో మారుస్తారా.. కొనసాగిస్తారా..!

దేశమంతటా కాషాయ జెండా రెపరెపాలించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. గుట్టుచప్పుడు కాకుండా తన వ్యూహాలను అమలు చేస్తోంది.. కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మరింత దూకుడుగా వెళ్తోంది. ఇటీవలే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కమలదళం.. తాజాగా పాలనలోనూ ప్రత్యేక విధానాలను అవలంబిస్తోంది. పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్న రాష్ట్రాల్లో పట్టు మరింత పెంచుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది మోదీ సర్కార్‌.

ఇటీవల ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించిన కేంద్రం ప్రభుత్వం.. మరికొన్ని రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమిస్తూ.. రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా జగదీష్‌ ధన్‌కర్‌, త్రిపుర గవర్నర్‌గా రమేశ్‌ బైస్‌, బిహార్‌ గవర్నర్‌గా ఫాగు చౌహాన్‌, నాగాలాండ్‌ గవర్నర్‌గా ఆర్ఎన్‌ రవిని నియమించారు.

కేవలం కొత్త గవర్నర్లను నియమించడమే కాదు.. ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆనంది బెన్‌ పటేల్‌.. ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. బిహార్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన లాల్‌జీ టాండన్‌.. మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. కొత్త గవర్నర్లు బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి వారి నియామకాలు అమల్లోకి వస్తాయి.

మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలకు పదవీ కాలం ముగియటంతో కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. యూపీ గవర్నర్‌గా ఆనందీ బెన్ పటేల్ నియమించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. 1950లో ప్రారంభమైనప్పటి నుంచి యూపీకి లేడీ గవర్నర్ ఉండటం ఇదే మొదటిసారి. ఇటీవల యూపీ లోక్‌సభ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించినప్పటికీ ప్రస్తుతం యూపీ సర్కార్‌పై స్తానికంగా వ్యతిరేకత ఎక్కవ కనిపిస్తోంది. మరో మూడేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో.. ఇప్పటి నుంచి గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసే పనిలో పడింది కేంద్రం..

ప్రధానంగా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ రాష్ట్రాల్లో క్రియాశీలక గవర్నర్లను నియమించి తమ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవాలని ప్రధాని మోదీ, పార్టీ చీఫ్‌ అమిత్‌ షాలు వ్యూహ రచన చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో అన్ని విషయాలలో అడ్డుపడుతున్న సీఎం మమతా బెనర్జీకి చెక్‌ పెట్టేందుకు.. ప్రముఖ న్యాయవాది.. బీజేపీకి అత్యంత నమ్మకస్తుడు సీనియర్‌ నేత, మాజీ ఎంపీ అయిన జగదీప్‌ థాంకర్‌ను నియమించింది..

మొన్నే బీజేపీ సీనియర్ నేత బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఏపీకి గవర్నర్‌గా నియమించారు. ఆయన జులై 24న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ లను నియమించడంతో ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌పై పడింది. సుదీర్ఘ కాలంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా కొనసాగుతున్న ఆయన్ను.. మరో విడతలో మారుస్తారా.. లేక తెలంగాణ గవర్నర్‌గా కొనసాగిస్తారా అన్నది చూడాలి.

ఇటీవల సార్వత్రిక ఎన్నికట్లో పోటీ నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుష్మా స్వరాజ్, మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు గవర్నర్ పదవులు ఇస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు కూడా గవర్నర్ పదవి వస్తుందని వార్తలు వచ్చాయి. మూడో దఫా కేటాయింపుల్లోనూ వీరికి గవర్నర్ పదవుల దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story