ఉద్యోగం దొరక్క తిరిగొస్తూ లాటరీ టికెట్ కొన్నాడు.. 28 కోట్ల 48 లక్షలు గెలుచుకున్నాడు..

ఉద్యోగం దొరక్క తిరిగొస్తూ లాటరీ టికెట్ కొన్నాడు.. 28 కోట్ల 48 లక్షలు గెలుచుకున్నాడు..

ఉన్న ఊళ్లో ఉద్యోగం లేదు. భార్యా బిడ్డలను పోషించే దారిలేక ఎవరో చెబితే విని దుబాయ్ ఫ్లైట్ ఎక్కాడు. దూరపు కొండలు నునుపు అని అక్కడికి వెళ్లాకే తెలిసింది. అయిన వారు లేరు.. ఆదుకునే వారు లేరు. సరైన ఉద్యోగం లేదు. బ్రతుకు భారమైపోయింది. తెచ్చుకున్న డబ్బులు అయిపోతున్నాయి. ఇలాగే ఉంటే కష్టమని తిరుగు ప్రయాణమయ్యాడు తెలంగాణ నిజామాబాద్‌కు చెందిన రిక్కాల విలాస్. అయితే అతడికో వీక్‌నెస్ లాటరీ టికెట్లు కొనడం. ఏమో అదృష్ట దేవత ఒకసారి కాకపోయినా ఒకసారైనా తలుపుతడుతుందని. అప్పటికి చాలా సార్లు కొన్నా ఒక్కసారి కూడా లాటరీ తగల్లేదు. ఎలాగూ స్వదేశానికి వెళ్లిపోతున్నావు కదా.. లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఓ సారి ట్రై చేయమంటూ మనసు పోరుపెడుతుంటే 20 వేలతో మిత్రుడి ద్వారా 3 టికెట్లు కొనుగోలు చేశాడు.

విలాస్‌కు భార్య పద్మ.. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్దమ్మాయి హిమాని ఇంటర్ చదువుతుండగా, రెండో అమ్మాయి మనస్విని 8వ తరగతి చదువుతోంది. ఉన్న కొద్ది పాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. అయితే ఆదాయం సరిపోవడం లేదని భావించిన విలాస్ 45 రోజుల కిందట దుబాయ్ వెళ్లాడు. ఇది వరకు కూడా ఓ సారి దుబాయ్ వెళ్లి అక్కడ డ్రైవర్‌గా పని చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉండేది విలాస్‌కి. ఈ సారి మళ్లీ వెళ్లాడు కానీ ఉద్యోగం ఏదీ దొరకట్లేదు. దీంతో నిరాశ చెందిన విలాస్ తిరిగి స్వదేశానికి వచ్చేస్తున్నాడు. ఈ క్రమంలో మళ్లీ లాటరీ ఆకర్షించింది. అక్కడ ఎయిర్ పోర్టులో ప్రతినెల బిగ్ టికెట్ పేరుతో లాటరీ టికెట్ నిర్వహిస్తుంటారు. దాన్ని భార్య ఇచ్చిన 20 వేల రూపాయలతో మూడు టికెట్లు కొన్నాడు. ఒక్కటైనా తగలకపోతుందా అన్న ఆశతో. అనూహ్యంగా అతడు కొన్న టికెట్లలో ఒకదానికి జాక్‌పాట్ తగిలింది. ఈ లాటరీలో విలాస్ ఏకంగా 4.08 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 28 కోట్ల 40 లక్షలు సొంతం చేసుకున్నాడు. బిగ్ టికెట్ వెబ్ పోర్టల్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మా కష్టాలు ఈ లాటరీతో తీరిపోనున్నాయి అని కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

విలాస్‌ రిక్కాల, రవి మాసిపెద్ది.. ఇద్దరూ ఇండియాలోని తెలంగాణకు చెందిన నిజామాబాద్‌ జిల్లా వాసులు. కొంతకాలంగా ఈ ఇద్దరూ టిక్కెట్లు కొనుగోలు చేస్తూ వస్తున్నారు. అయితే, జులై 29న కొనుగోలు చేసిన టికెట్‌కి అదృష్టం వరించింది. 15 మిలియన్‌ దిర్హామ్‌లను బిగ్‌ టికెట్‌ అబుదాబీ రాఫెల్ లో గెలుచుకున్నారు. ఇండియాకి వెళ్ళిపోయిన విలాస్‌ రిక్కాల, తనకు వచ్చిన బహుమతి పట్ల అమితమైన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దుబాయ్‌లో 4 నుంచి 5 ఏళ్ళు పనిచేశానని ఆయన చెప్పారు. మరోపక్క రవి మాసిపెద్ది మాట్లాడుతూ, చాలా ఏళ్ళుగా తామిద్దరం టిక్కెట్లు కొంటున్నామనీ, ఎట్టకేలకు తమకు బహుమతి లభించిందని అన్నారు. లాటరీ ద్వారా వచ్చిన మొత్తాన్ని స్నేహితులిద్దరం చెరిసగం పంచుకుంటామని అన్నారు. కాగా, టాప్‌ 10 విన్నర్స్‌లో ఇండియన్స్‌ ఎక్కువగా వున్నారు. మొత్తం ఐదుగురు బిగ్‌ టికెట్‌ అబుదాబీ రాఫెల్ లో విజేతలుగా నిలిచారు. ఫిలిప్పీన్స్‌ నుంచి ఇద్దరు, ఈజిప్ట్‌ మరియు సోమాలియా నుంచి చెరొకరు విజేతలున్నారు.

Tags

Read MoreRead Less
Next Story