ఎన్టీఆర్‌కు ముందు.. తర్వాత.. తెలుగు తెరపై..

ఎన్టీఆర్‌కు ముందు.. తర్వాత.. తెలుగు తెరపై..

ఓ సాధారణ యువకుడు.. నాటి అందరు కుర్రాళ్లలాగానే జీవితంపట్ల ఎన్నో కలలు కన్నాడు. ఆ క్రమంలో కాలేజీ చదువు, నాటకాలు ఒకవైపు, కుటుంబానికి ఆసరాగా సైకిలు మీద తిరుగుతూ ఇంటింటికీ పాలుపొయ్యడం మరోవైపు. ఈలోగా కాలం ముందుకు వెళ్ళి అతనిని ఓ చిన్న పోలీసు ఇనస్పెక్టరు పాత్ర ద్వారా సినిమా రంగంలో ప్రవేశపెట్టింది. ఇక అక్కడనుండి అతను వడివడిగా అడుగులు వేసుకుంటూ తెలుగు ప్రజలగుండెలవైపు వేగంగా వచ్చాడు.. తన అసమాన నటనా కౌశలంతో తెలుగు సినిమాకు సార్వభౌముడయ్యాడు. తెలుగు వారి రాముడుగా, కృష్ణుడుగా, తెరవేల్పుగా నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాతుడయ్యాడు. ఇవాళ (మే 28) ఈ మరపురాని మనిషి జయంతి.

నందమూరి తారకరామారావు.. ఈ పేరు తెలుగువారి ఆత్మగౌరవ నినాద పతాకం. వెండితెర నటుడుగా తెలుగు ప్రజలకు తెలిసి.. అటుపై తన అసమాన నటనా కౌశలంతో అందరి మనసులు కొల్లగొట్టి.. అశేష తెలుగు ప్రజల ఆరాధ్య నటుడుగా ఎన్టీఆర్ ఎదిగిన వైనం ఓ శిఖర ప్రయాణం వంటిది. ఎత్తులే కానీ పల్లాలు లేని నట జీవితంలో ఆయన చేయని పాత్ర లేదు.. చేయలేని పాత్రా లేదు. సాధారణ రైతు కుటుంబంలో మట్టి మనిషిగా మొదలైన ఎన్టీఆర్ ప్రస్థానం తెలుగువారి హృదయసీమపై మరపురాని మనిషిగా ముద్రించేంత వరకూ సాగిన ప్రయాణం అనన్యసామాన్యం.. సాంఘికి చిత్రాలతో మొదలైన ఎన్టీఆర్ ప్రస్థానం కాస్త ఆలస్యంగా తెరవేల్పుగా మారింది. ఆలస్యమైనా అసలు రూపం చూశాం అని ప్రేక్షకులు అనుకునేంతగా ఆ పాత్రలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఎన్టీఆర్. రాముడంటే ఇలాగే ఉంటాడేమో.. కృష్ణుడూ ఈయనే కదా అని ఎవరికి వారు రామారావును తెరవేల్పుగా ఆరాధించడం మొదలుపెట్టారు. అప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో ఎందరో నటులు దేవుడి పాత్రల్లో కనిపించారు. కానీ ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ఆ ముద్రను వేయగలిగారు..

మాయాబజార్ లో కృష్ణుడుగా లవకుశలో రాముడుగా.. వెంకటేశ్వర మహత్యంలో శ్రీనివాసుడుగా.. శ్రీ కృష్ణ పాండవీయంలో కృష్ణుడుగా, సుయోధనుడుగా ఇలా.. ఎలా చూసినా ఆయా పాత్రల్లో ఎన్టీఆర్ మాత్రం కనిపించేవారు కాదు. తెరపై ప్రేక్షకులు రాముడినో, కృష్ణుడినో చూస్తున్నాం అనుకునేంతగా లీనమైపోయారు. అందుకు కారణం.. ఆయా పాత్రల పోషణలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు. ఆ పాత్రల్లో ఆయన చూపిన ఆహార్య ఆంగికాభినయ వాచక ప్రతిభే అంటే అతిశయోక్తేముందీ..?ఎన్టీఆర్ కు ముందు.. తర్వాత తెలుగు తెరపై ఎందరో దేవుడి వేషాలు వేశారు. ఆయన చేసిన పాత్రల్లో ఒక నిష్ట కనిపిస్తుంది. నిశ్చలమైన అభినయం ఉంటుంది. దేవుడి పాత్రలు చేస్తున్నప్పుడు తను నటిస్తున్నాడు అని కాక.. తాను నిజంగా దేవుడినే అనుకున్న ఆత్మవిశ్వాసమే ఆయన్ని తెలుగువారి తెరవేల్పుగా చేసిందనేది నిజం.. అందుకే ఆ పాత్రల్లో సరిలేరు ఆయనకెవ్వరూ.. సరిరారు ఇంకెవ్వరూ.

Tags

Read MoreRead Less
Next Story