రాపాకకు బెయిల్.. వైసీపీ ఎమ్మెల్యే దాడి సంగతి ఏంటంటూ పవన్ ప్రశ్న

రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ విషయంలో హైడ్రామా నడిచింది. చివరికి ఈ ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే..స్వయంగా రాజోలు వస్తానంటూ హెచ్చరించారు పవన్ కళ్యాణ్. అధికారం ఉంటే ఎంత దౌర్జన్యానికైనా తెగపడొచ్చన్నట్లుగా జగన్ సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు లోకేష్.

తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు బెయిల్‌ మంజూరైంది. స్టేషన్‌ బెయిల్‌పై ఆయన్ను విడుదల చేశారు. మలికిపురం పీఎస్‌పై దాడి ఘటనలో ఎమ్మెల్యేపై 3 రోజుల కిందట కేసు నమోదయ్యింది. అరెస్ట్ చేస్తారన్న వార్తలతో చివరికి ఎమ్మెల్యేనే స్వయంగా వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు. నాన్‌ బెయిలబుల్ కేసు నమోదు చేసిన పోలీసులు..తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయన్ను రాజోలు కోర్టులో హాజరు పరిచారు. అయితే ఈ కేసు తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసిన న్యాయస్థానం.. విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు వెళ్లాలని సూచించింది. ఇది పెద్ద నేరమేని కాదని...రాపాకకు స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి రాపాకను విడుదల చేశారు...

మలికిపురంలో పేకాట ఆడుతున్న 9 మందిని ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారిని వదిలిపెట్టాలని ఎమ్మెల్యే రాపాక స్టేషన్‌కు వచ్చి మాట్లాడారు. అయితే ఎస్సై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన కార్యకర్తలతో కలిసి అక్కడ ధర్నాకు దిగారు. దీంతో స్టేషన్‌పై దాడి చేశారంటూ ఎమ్మెల్యేతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఆ కేసు విషయంలోనే ఆయన్ను కోర్టుఎదుట హాజరుపరిచారు..

ఎమ్మెల్యే రాపాక అరెస్ట్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. స్టేషన్‌ బెయిల్‌తో పోయే ఇష్యూని.. నాన్‌బెయిలబుల్ వరకు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెస్తారా అని ప్రశ్నించారు. నెల్లూరు లో వైసీపీ ఎమ్మెల్యే జర్నలిస్ట్ పై దాడికి ప్రయత్నిస్తే... నామ్‌కే వాస్తే అన్నట్లు చిన్న కేసులు పెట్టివదిలేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే.. రాజోలు వచ్చి పోరాడతానని హెచ్చరించారు పవన్ .

రాపాక అరెస్ట్ ఎపిసోడ్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మండిపడ్డారు. ఒక పత్రికా విలేకరిని చంపుతా అంటూ బెదిరించిన ఎమ్మెల్యేని అరెస్ట్ చేయని ప్రభుత్వం.. ప్రశ్నించేందుకు పోలీస్‌ స్టేషన్ వెళ్లిన ఎమ్మెల్యేను మాత్రం అరెస్ట్ చేసిందని విమర్శించారు. అధికారం ఉంటే ఎంత దౌర్జన్యమైనా చేయొచ్చా? ఏంటీ నియతృత్వం అంటూ వైసీపీ సర్కారుని ట్విట్టర్‌లో నిలదీశారు లోకేష్..మొత్తానికి రాపాక ఎపిసోడ్‌కు స్టేషన్‌ బెయిల్‌తో తాత్కాలికంగా తెరపడింది. అయితే ముందుజాగ్రత్తగా రాపాకతోపాటు, మకిలిపురంలోనూ భద్రత కొనసాగిస్తున్నారు...

Tags

Read MoreRead Less
Next Story