గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఆలయం అదే..

గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఆలయం అదే..

గ్రహణ సమయంలో చంద్రుని నుంచి వెలువడే విష కిరణాలు దేవాలయాలపై ప్రభావం చూపుతాయనే నమ్మకం మనలో ఉంది. గ్రహణాలు సంభవించినపుడు ఆలయాలను మూసివేస్తారు. శ్రీవారి ఆలయం సహా ప్రతి ఆలయం మూతబడుతుంది. కానీ, శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో మాత్రం గ్రహణ సమయంలో భక్తులు దర్శనానికి పోటెత్తుతారు. గ్రహణం.. ఈ మాటే అరిష్టంగా భావిస్తాం.. ఈ భూమికి చల్లదనాన్ని, కాంతిని పంచే సూర్య చంద్రులను రాహుకేతువులు మింగడాన్ని కీడుగా శంకిస్తాం.. గ్రహణ సమయాన్ని దోషకాలంగా భావిస్తాం.. ఆ సమయంలో దైవశక్తి తగ్గిపోతుందని, గ్రహణ సమయంలో పూజలు చేస్తే మంత్రశక్తి క్షీణిస్తుందని పండితులు చెబుతారు. అంతేకాదు, గ్రహణం పట్టినపుడు విగ్రహం కింద ఉండే శక్తివంతమైన యంత్రబీజాక్షర శక్తిని ధ్వంసం చేసే శక్తి గ్రహణకాల కిరణాలకు ఉంటుందని అంటారు. దోషం అంటకుండా ఉండేందుకు అన్ని దేవాలయాలను మూసివేస్తారు అర్చకులు.

నేడు ( మంగళవారం ) పాక్షిక చంద్రగ్రహణం నేపథ్యంలో శ్రీవారి ఆలయం నుంచి చిన్న ఆలయాల వరకు అన్నింటినీ మూసివేయనున్నారు. గ్రహణ పుణ్య కాలం అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసి పూజాధికాలు నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అయితే గ్రహణం సమయంలో అన్ని ఆలయాలు మూసివేస్తే.. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రం మాత్రం తెరిచే ఉంటుంది. ఎందుకంటే, శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు, కేతువులను పూజిస్తారు. అంతేకాదు, శ్రీకాళహస్తీశ్వరుడు గ్రహణాతీతుడని, వాయులింగ క్షేత్రం కావడంతో స్వామి ఆలయంపై విష కిరణాల ప్రభావం ఉండదని పండితులు చెబుతారు. ఈ దివ్యక్షేత్రంలో వెలసిన శ్రీకాళహస్తీశ్వరస్వామి తొమ్మిది గ్రహాలు, 27 నక్షత్రాలను నిక్షిప్తం చేసుకున్న కవచంతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. అందువల్ల ఇక్కడి క్షేత్రంలో రాహు, కేతువుల ఆటలు సాగవని పండితులు చెబుతారు. చంద్రగ్రహణం అనంతరం గ్రహణాతీతుడైన శ్రీకాళహస్తీశ్వరుణ్ని దర్శించుకుంటే శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. గ్రహణం సమయంలో ఈ వాయులింగ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

గ్రహణ కాలాదుల్లోనూ తెరిచివుండే ఆలయంగా కాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. దక్షిణ కాశిగా పేరున్న ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. గ్రహణానంతరం కాళహస్తీశ్వరుని దర్శనం చేసుకునే వారికి దారిద్య్రం, దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. గ్రహణ కాలాభిషేకాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. రాహుకేతు దోషాలను నివారించే క్షేత్రం కాళహస్తి కాబట్టి, సూర్య, చంద్రగ్రహణ దోషాలు ముక్కంటిని ఏమాత్రం అంటవంటారు. గ్రహణానంతరం ఆలయ పరిసరాల్లో ఉన్న తీర్థాల్లో స్నానమాచరించి వాయులింగేశ్వరుణ్ని దర్శించుకుంటే మంచిదని చెబుతారు. బుధవారం తెల్లవారుజామున స్వామి అమ్మవార్లకు గ్రహణ శాంతి అభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం గోపూజ నిర్వహించిన అనంతరం దర్శనం ప్రారంభమవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story