ఇంత నిర్లక్ష్యమా..! బక్క రైతు ఇంటి కరెంటు బిల్లు రూ.5.30 లక్షలా?

విద్యుత్ అధికారుల నిర్వాకం మరోసారి బయటపడింది. కరెంటు బిల్లుల రీడింగ్‌ నమోదులో స్పాట్‌బిల్లర్‌ చేసిన తప్పిదం ఓ రైతుకు గుండె అగినంత పనిచేసింది.  వారు చేసిన చిన్నతప్పిదం వల్ల రూ.5.30లక్షల మేర విద్యుత్‌ బిల్లు రావడం కలకలం రేపింది సిద్దిపేట జిల్లా చేర్యాల మునిసిపాలిటీ పరిధిలో బండపల్లికి చెందిన ముస్తాల అంజయ్య అనే రైతు ఇంటికి విద్యుత్ అధికారులు తలతిరిగిపోయేలా భారీ కరెంటు బిల్లు పంపారు. అతడు 58046 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించుకున్నాడంటూ ఏకంగా రూ. 5,30,539 బిల్లు పంపారు. దాన్ని చూసిన ఆ రైతుకు షాక్ కొట్టినంత పనైంది. ప్రతీనెలా రూ.150–200వరకు వచ్చే బిల్లు మే నెలలో రూ. లక్షల్లో  రావడం ఆందోళనకు గురిచేసింది.

ఏప్రిల్‌ నెలలో రీడింగ్‌ 6,386 యూనిట్లుగా ఉండగా, మే నెలలో 57 యూనిట్లు పెరిగి 6,443 యూనిట్లు నమోదైంది. దీనికి బదులుగా 64,432 యూనిట్లు వాడినట్లుగా రీడింగ్‌ నమోదు చేయడంతో అదనంగా 58,046 యూనిట్ల కరెంటు వినియోగించినట్లు బిల్లు వచ్చింది. ఈ విషయంపై స్పందించిన అధికారులు హుటాహుటిన అతని ఇంటికి వెళ్లి విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ పరిశీలించారు. దీంతో స్పాట్‌ బిల్లర్‌ నిర్లక్ష్యం బయటపడింది. తప్పు రీడింగ్ నమోదైనట్లు గుర్తించి వినియోగించిన మొత్తానికి రూ.162 రసీదు అందించారు. గతంలో కూడా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాలు చాలనే బయటపడ్డాయి. వేలల్లో రావల్సిన బిల్లు లక్షల్లో వచ్చేలా చేశారు. తాజా ఘటనతో
అధికారులు ఇంకా మెుద్దునిద్ర వీడడంలేదని అర్థమవుతుంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *