విశాల్‌ తమిళుడు కాదు..అతడిని నడిగర్ నుంచి బయటకు పంపాలి

తీవ్ర ఉత్కంఠ రేపిన చెన్నై నడిగర్ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఎన్నికల బరిలో విశాల్‌, భాగ్యరాజ్‌ టీమ్‌లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆది నుంచి వివాదాలు.. వాడివేడి విమర్శలతో ఎన్నికల ముందు తీవ్ర ఉద్రిక్తతలు కనిపించాయి. ప్రశాంతంగా పోలింగ్‌ ముగిసినా.. మద్రాస్‌ హైకోర్టు తుదితీర్పు తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నారు.

దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రముఖులు సహా.. పలువురు నటీ నటులు, నాటకరంగ కళాకారులు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. కమల్ హసన్, విజయ్, సూర్య, కార్తీ, పార్తీభన్, కేయస్.రవికుమార్, విశాల్, నాజర్, బాగ్యరాజ్, సంగీత, రాధ, అంబిక, జయమాలిని, రోహిణి, వరలక్ష్మిలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 3171 సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ఈ ఎన్నికల్లో విశాల్‌, భాగ్యరాజ్‌ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇటీవల ఈ రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం జరగడంతో ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గతంలో నాజర్‌ ప్యానెల్‌లో ఉన్న వ్యక్తి ఐసరి గణేశ్‌ ఈసారి కార్యదర్శి పదవికి పోటీ పడ్డారు. అతడికి పోటీగా విశాల్‌ బరిలో నిలిచారు. ఇక నాజర్‌, భాగ్యరాజ్‌ అధ్యక్ష పదవికి.. కార్తీ, ప్రశాంత్‌ కోశాధికారి పదవులకు పోటీ చేస్తున్నారు. విశాల్‌ తమిళ వ్యక్తి కాదని, అతడిని నడిగర్ సంఘం నుంచి బయటకు పంపాలని ప్రత్యర్థి భాగ్యరాజ్‌ సంచలన కామెంట్స్ చేయడంతో పోటీ వేడెక్కింది.

ఎన్నికల్లో ఎవరు గెలిచినా నడిగర్ సంఘం భవనం పూర్తిచేయడమే లక్ష్యంగా వుండాలన్నదే తమ నిర్ణయం అన్నారు కార్యదర్శి అభ్యర్థి విశాల్‌. అలాగే పోస్టల్‌ బ్యాలెట్‌ అందకపోవడంతో ముంబైలో దర్బార్‌ షూటింగ్‌లో ఉన్న తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తంచేశారు. పదిరోజుల ముందే పోస్టల్ బ్యాలెట్లు పంపామని, పోస్టల్‌ శాఖ ఆలస్యం కారణంగా అవి అందలేదని నటి కుష్భూ తెలిపారు.
ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినా ఫలితాల కోసం అంతా వేచి చూడాక తప్పడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే వర్గాల మధ్య గొడవలు మురదడంతో ఓ అధికారి నడిగర్ సంఘం ఎన్నికల్ని నిలిపివేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ చేసింది. కానీ కోర్టు అనుమతి లేకుండా ఎన్నికల ఫలితాలను మాత్రం వెల్లడించడానికి వీళ్లేదని షరతు విధించింది. వచ్చే నెల 8న ఈ కేసుపై మళ్లీ కోర్టులో విచారణ జరగనుంది. ఆ తరువాతే ఫలితాలు వెల్లడి కానున్నాయి..

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *