నేడు ఉజ్జయినీ మహంకాళి బోనాలు..

నేడు ఉజ్జయినీ మహంకాళి బోనాలు..

తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టేది బోనాల పండుగ. ఆషాఢ మాసం కావడంతో మరోసారి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఆధ్యాత్మిక శోభతో భాగ్యనగరం మురిసిపోతోంది. లష్కర్ బోనాలకు ఓ ప్రత్యేక స్థానముంది. సికింద్రాబాద్ కు చెందిన సురిటి అప్పయ్య అనే భక్తుడు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ మిలటరీలో పనిచేస్తుండేవారు. 1813లో ఉజ్ఙయిని నగరంలో కలరా వ్యాప్తి చెందింది. వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఉజ్జయినిలోని మహాంకాళి అమ్మవారిని దర్శించుకుని, కలరా నుంచి ప్రజలను రక్షిస్తే సికింద్రాబాద్ లో ప్రతిష్ఠించి ఆలయం నిర్మించి పూజలు చేస్తామని అప్పయ్య మొక్కుకున్నారు. అప్పుడు అమ్మవారి దయతో కలరా నుంచి అనేక వేల మంది బయటపడ్డారు. మొక్కులో భాగంగా అప్పయ్య ఇక్కడకు వచ్చి.. 1815లో ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని నెలకొల్పారు. అప్పటినుంచి ప్రతి యేటా ఆషాఢమాసంలో బోనాల జాతర జరపడం ఆచారంగా వస్తోంది.

ఈ ఏడాది కూడా రంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 7న ఘటోత్సవంతో అంకురార్పణ జరిగింది. మొత్తం 15 రోజుల పాటు అమ్మవారు సికింద్రాబాద్ పుర వీధుల్లో తిరుగుతూ ప్రజలకు దీవెనలందించారు. ఇక సికింద్రాబాద్ బోనాలు సమర్పించే అసలైన వేడుక కూడా మొదలైంది. తెల్లవారు జామున 4 గంటలకు మంత్రోచ్చరణల మధ్య అర్చకులు ఆలయ ద్వారాలు తెరిచారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముఖ్యమంత్రి KCRతో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటారు. లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు మంత్రి తలసాని ఇంటి నుంచి 108 బోనాలతో మాజీ ఎంపీ కవిత ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. మరోవైపు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు.. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అధికారులు ప్రత్యేక క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ కూడా నగరంలో జరుగుతున్న బోనాల జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాల తో నిఘా పెట్టింది.

రేపు రంగం కార్యక్రమం జరుగుతుంది.. ఉదయం 9 గంటలకు స్వర్ణలత అనే అవివాహిత మహిళ అమ్మవారికి ఆభిముఖంగా పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి చెబుతుంది. అనంతరం అమ్మవారు గజారోహనం, ఫలహరల బండ్ల ఊరేగింపుతో లష్కర్‌లో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. మొత్తం మీద బోనాల ఉత్సవాలతో భాగ్యనగరంలో పండగ వాతావరణం నెలకొంది.. విద్యుత్‌ దీప కాంతులతో అమ్మవారి ఆలయం వెలిగిపోతోంది.. పోతురాజుల విన్యాసాలు, శివ సత్తుల పునకాలతో నగరం పల్లెను తలపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story